Sushila Karki: నేపాల్ ప్రధాని భర్త ఒక హైజాకర్... బాలీవుడ్ నటి సాక్షిగా జరిగిన ఆ హైజాక్ కథ మీకు తెలుసా?

 Sushila Karki husband Durga Prasad Subedi Hijacked Plane For Nepal Democracy
  • నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి భర్త విమానం హైజాక్
  • 1973లో జరిగిన సంచలన ఘటన
  • హైజాక్ సమయంలో విమానంలో బాలీవుడ్ నటి మాలా సిన్హా
  • రాచరికానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నిధుల సేకరణ
  • ప్రణాళిక రచించిన నేపాల్ మాజీ ప్రధాని గిరిజా ప్రసాద్ కొయిరాలా
  • బీహార్‌లోని ఫోర్బ్స్‌గంజ్‌లో విమానం ల్యాండింగ్
నేపాల్ దేశ చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, అవినీతిపై ఉక్కుపాదం మోపిన వ్యక్తిగా తాత్కాలిక ప్రధాని సుశీల కార్కికి ఎంతో పేరుంది. అయితే, ఆమె జీవితంలో అంతగా ప్రచారంలోకి రాని ఒక ఆసక్తికరమైన కోణం ఉంది. ఆమె భర్త దుర్గా ప్రసాద్ సుబేదీ, ఒకప్పుడు ప్రజాస్వామ్యం కోసం ఏకంగా ఒక విమానాన్ని హైజాక్ చేశారు.  

1973, జూన్ 10న నేపాలీ కాంగ్రెస్ యువ నాయకుడైన దుర్గా ప్రసాద్ సుబేదీ తన ఇద్దరు సహచరులతో కలిసి రాయల్ నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని హైజాక్ చేశారు. బిరత్‌నగర్ నుంచి ఖాట్మండు వెళ్తున్న ఆ విమానంలో నేపాల్ స్టేట్ బ్యాంకుకు చెందిన సుమారు 40 లక్షల నేపాలీ రూపాయలు (అప్పటి విలువ ప్రకారం 4 లక్షల డాలర్లు) ఉన్నాయి. దేశంలో రాచరిక పాలనను కూలదోసి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి సాయుధ పోరాటానికి నిధులు సేకరించడమే ఈ హైజాక్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రణాళిక వెనుక భవిష్యత్తులో నాలుగుసార్లు నేపాల్ ప్రధానిగా పనిచేసిన గిరిజా ప్రసాద్ కొయిరాలా ఉన్నారని చెబుతారు.

హైజాకర్లు తుపాకీతో పైలట్‌ను బెదిరించి, విమానాన్ని భారత్‌లోని బిహార్ లోని ఫోర్బ్స్‌గంజ్‌లో ఒక పచ్చిక బయలులో చాకచక్యంగా ల్యాండ్ చేయించారు. విమానంలో ఉన్న ప్రయాణికులను గానీ, సిబ్బందిని గానీ వారేమీ చేయలేదు. కేవలం డబ్బు ఉన్న మూడు పెట్టెలను కిందకు దించుకుని, విమానాన్ని ఖాట్మండుకు తిరిగి వెళ్లడానికి అనుమతించారు. ఆ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులలో ప్రముఖ హిందీ నటి మాలా సిన్హా కూడా ఉన్నారు.

డబ్బుతో పరారైన సుబేదీ బృందం, ఆ నిధులను అప్పటికే భారత సరిహద్దులో ఎదురుచూస్తున్న గిరిజా ప్రసాద్ కొయిరాలాకు అప్పగించింది. ఆ తర్వాత భారత పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. సుబేదీ రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి, ఆ తర్వాత నేపాల్‌కు తిరిగి వెళ్లారు. వారణాసిలో విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే సుశీల కార్కి, దుర్గా ప్రసాద్ సుబేదీని కలుసుకుని వివాహం చేసుకున్నారు. ఈ చారిత్రక ఘటన గురించి సుబేదీ తన ఆత్మకథ 'బిమాన్ బిద్రోహ' (విమాన తిరుగుబాటు)లో వివరంగా రాసుకున్నారు.
Sushila Karki
Durga Prasad Subedi
Nepal
hijack
Mala Sinha
Girija Prasad Koirala
Royal Nepal Airlines
democracy
crime
Forbesganj

More Telugu News