మహిళలంటే ఫర్నిచర్ కాదు.. పవన్ ఫ్యాన్ కామెంట్‌పై రేణూ దేశాయ్ ఫైర్!

  • పితృస్వామ్య మనస్తత్వంపై ఇన్‍స్టాలో సుదీర్ఘ పోస్ట్
  • మహిళలను ఇంకా ఆస్తిగానే చూస్తున్నారంటూ ఆవేదన
  • ఫెమినిజం అంటే ఇదేనంటూ గట్టిగా బదులు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రేణూ దేశాయ్ వ్యాఖ్యలు
నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్యపై తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ అర్ధాంగి గానే మిమ్మల్ని చూస్తామని ఓ అభిమాని చేసిన కామెంట్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సమాజంలో మహిళల పట్ల ఉన్న పితృస్వామ్య ధోరణిని ప్రశ్నిస్తూ ఇన్‍స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే..!
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రేణు దేశాయ్‌కు ఇటీవల పవన్ కల్యాణ్ అభిమాని నుంచి ఊహించని వ్యాఖ్య ఎదురైంది. "మిమ్మల్ని మేము ఇంకా పవన్ కల్యాణ్ భార్యగానే చూస్తాం. మీ జీవితంలో మరో వ్యక్తిని ఊహించలేం" అని సదరు అభిమాని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్య తనను ఎంతగానో బాధించిందని చెబుతూ, ఆ కామెంట్ స్క్రీన్‌షాట్‌ను కూడా రేణు తన పోస్ట్‌కు జత చేశారు. ఇంగ్లీషులో కామెంట్ రాసేంత చదువు ఉన్న వ్యక్తి కూడా మహిళలను ఒకరి ఆస్తిగా భావించడం విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

"మనం 2025లో ఉన్నప్పటికీ, స్త్రీలను ఇప్పటికీ భర్త లేదా తండ్రి ఆస్తిగా పరిగణించే పితృస్వామ్య మనస్తత్వం సమాజంలో బలంగా పాతుకుపోయింది" అని రేణు దేశాయ్ పేర్కొన్నారు. చదువు, ఉద్యోగం వంటి నిర్ణయాలకు కూడా మహిళలకు నేటికీ ‘పర్మిషన్’ అవసరం అవుతోందని, వారిని కేవలం వంటగదికి, పిల్లల్ని కనడానికే పరిమితం చేసే ధోరణి కొనసాగుతోందని అన్నారు.

ఈ ధోరణికి వ్యతిరేకంగా తాను గళం విప్పుతానని, భవిష్యత్ తరాల మహిళల కోసమైనా ఈ మార్పు అవసరమని ఆమె స్పష్టం చేశారు. "ఫెమినిజం అంటే వీకెండ్‌లో తాగి తిరగడం కాదు. మహిళలను పశువులుగా లేదా ఫర్నిచర్‌లా చూసే బేసిక్ మైండ్‌సెట్‌ను ప్రశ్నించడమే అసలైన ఫెమినిజం" అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. రాబోయే తరాల్లో అయినా స్త్రీలు తమ స్థానాన్ని సంపాదించుకోవాలని, గర్భంలోనే చిదిమేయడం, పరువు హత్యలు, వరకట్న మరణాలు వంటివి ఉండకూడదని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.


More Telugu News