AP Govt: అంగన్‌వాడీల్లో 4,687 సహాయకుల పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Government Approves To Appointment Of 4687 New Anganwadi Helper Posts
  • ఇటీవల మెయిన్ కేంద్రాలుగా మారిన మినీ అంగన్‌వాడీలలో ఈ నియామకాలు
  • పదో తరగతి పాసైన 4,687 మంది మినీ కార్యకర్తలకు పదోన్నతులు
  • పదోన్నతి పొందిన వారికి నెలకు రూ.11,500 గౌరవ వేతనం
  • నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు
  • త్వరలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం
ఏపీలో అంగన్‌వాడీ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పూర్తిస్థాయి (మెయిన్) అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ అయిన 4,687 కేంద్రాల్లో సహాయకుల (హెల్పర్ల) పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని 4,687 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి కేంద్రాలుగా ప్రభుత్వం ఇటీవల మార్చిన విషయం తెలిసిందే. ఈ కేంద్రాల్లో సేవలను మరింత మెరుగుపరచడానికి, కార్యకర్తలపై పనిభారాన్ని తగ్గించడానికి ప్రతి కేంద్రానికి ఒక సహాయకురాలిని నియమించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్తగా 4,687 సహాయకుల పోస్టులను మంజూరు చేస్తూ వాటి భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ నియామకాలకు పదో తరగతి విద్యార్హతగా నిర్ణయించే అవకాశం ఉంది.

మరోవైపు, అప్‌గ్రేడ్ అయిన కేంద్రాల్లో పనిచేస్తున్న మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. పదో తరగతి ఉత్తీర్ణులైన 4,687 మంది మినీ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా గుర్తిస్తూ వారి గౌరవ వేతనాన్ని నెలకు రూ.11,500కు పెంచింది. తాజాగా సహాయకుల నియామకాలకు కూడా అనుమతి ఇవ్వడంతో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడనుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో మహిళా, శిశు సంక్షేమ శాఖ త్వరలోనే నియామకాలకు సంబంధించిన ప్రకటన విడుదల చేయనుంది.
AP Govt
Anganwadi helpers
Anganwadi recruitment
Andhra Pradesh jobs
Women and Child Welfare Department
Anganwadi centers
Mini Anganwadi
AP Govt jobs
Tenth class jobs
Anganwadi worker salary

More Telugu News