కూకట్‌పల్లి మహిళ హత్య కేసు: వాళ్లిద్దరే హంతకులు!
- ఇంట్లో పనిచేసే హర్ష, రోషన్‌ల పనేనని నిర్ధారించిన పోలీసులు
- బంగారం, నగదు దోపిడీ చేసేందుకే ఘాతుకం
- చిత్రహింసలు పెట్టి, కుక్కర్‌తో కొట్టి, గొంతుకోసి హత్య
- యజమాని స్కూటీపై పారిపోయిన నిందితులు
- నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. యజమాని స్టీల్ వ్యాపారి కావడంతో ఇంట్లో బంగారం, నగదు భారీగా ఉంటుందని భావించి దోపిడీకి పథకం పన్నారు. ఝార్ఖండ్‌లోని ఒకే ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు స్నేహితులు పక్కా ప్లాన్‌తో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. బాధితురాలు అనారోగ్యంతో ఉండటంతో ఆమెకు సహాయంగా ఉండేందుకు కేవలం 11 రోజుల క్రితమే హర్షను పనిలో పెట్టుకున్నారు.
రేణును హత్య చేసిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసుతో పాటు కొంత నగదు కూడా తీసుకుని నిందితులు పరారయ్యారు. యజమాని స్కూటీపైనే హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌కు చేరుకుని, అక్కడ వాహనాన్ని వదిలేసి రైలులో తప్పించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు కోల్‌కతాకు చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా పనిలో చేరినట్టు తెలుసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరించారు. అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.