Gold Loans: గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్.. రూ.3 లక్షల కోట్లకు చేరువలో రుణాలు

Gold Loans Demand Surges to Nearly Rs 3 Lakh Crore
  • రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు
  • జీవితకాల గరిష్ఠానికి పసిడి తనఖా రుణాలు
  • ఆగస్టులో రూ.2.94 లక్షల కోట్లకు చేరిన గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో
  • గతేడాదితో పోలిస్తే 53 శాతం పెరిగిన బంగారం విలువ
  • వ్యక్తిగత రుణాల కంటే తక్కువ వడ్డీ ఉండటమే ప్రధాన ఆకర్షణ
  • ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,100
దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో పసిడిపై రుణాలు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. బంగారం విలువ పెరగడంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇస్తున్న గోల్డ్ లోన్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి బ్యాంకుల గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో ఏకంగా రూ.2.94 లక్షల కోట్ల జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇలా పసిడి రుణాలు ఆల్ టైమ్ రికార్డుకు చేరడం ఇది వరుసగా 15వ నెల కావడం గమనార్హం.

రుణాల పెరుగుదలకు కారణాలు
కేవలం ఏడాది వ్యవధిలో 10 గ్రాముల బంగారం ధర 53 శాతం పెరిగింది. 2024 ఏప్రిల్‌లో రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్న గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో ఇప్పుడు దాదాపు మూడు రెట్లు పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి ప్రతినెలా ఈ రుణాల్లో వార్షిక ప్రాతిపదికన 100 శాతానికి పైగా వృద్ధి నమోదవుతోంది. ముఖ్యంగా, బ్యాంకులు తనఖా లేని వ్యక్తిగత రుణాల జారీలో కఠినంగా వ్యవహరిస్తుండటం, వాటితో పోలిస్తే గోల్డ్ లోన్లపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వంటివి ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీంతో, వ్యక్తిగత రుణాలు పొందే అవకాశం లేని వారికి బంగారంపై రుణం ఒక  ప్రత్యామ్నాయంగా మారింది.

బంగారం ధరలు పెరుగుతున్నంత కాలం గోల్డ్ లోన్లకు డిమాండ్ కొనసాగుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ శ్రీనివాసన్ తెలిపారు. బంగారం విలువ పెరగడంతో వినియోగదారులు తమ వద్ద ఉన్న పసిడిపై గతంలో కంటే ఎక్కువ రుణం పొందగలుగుతున్నారని ఆయన విశ్లేషించారు.

భగ్గుమంటున్న పసిడి ధరలు
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర రూ.100 పెరిగి రూ.1,13,100కు చేరింది. 2024 డిసెంబరు 31న రూ.78,950గా ఉన్న ధర, ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.34,150 మేర పెరిగింది. మరోవైపు, కిలో వెండి ధర కూడా రూ.500 పెరిగి రూ.1,28,000 వద్ద స్థిరపడింది.
Gold Loans
Gold price
Loans
Banks
Financial Institutions
Personal Loans
Interest Rates
ICRA
Karthik Srinivasan
Delhi

More Telugu News