Sonia Gandhi: ఓటరు జాబితాలో పేరు... సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట

Sonia Gandhi Gets Relief in Delhi Court Voter List Case
  • సోనియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్ కొట్టివేత
  • పౌరసత్వానికి ముందే ఓటరు జాబితాలో పేరు చేర్చారని ఆరోపణ
  • నకిలీ పత్రాలు వాడారంటూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్
  • ఆరోపణలను తోసిపుచ్చుతూ కోర్టు ఉత్తర్వులు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. భారత పౌరసత్వం పొందకముందే నకిలీ పత్రాలతో ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నారని ఆరోపిస్తూ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం గురువారం కొట్టివేసింది.

రౌస్ అవెన్యూ కోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వికాస్ త్రిపాఠి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. 1983లో భారత పౌరసత్వం పొందిన సోనియా గాంధీ, అంతకు మూడేళ్ల ముందే, అంటే 1980 జనవరిలోనే న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటరు జాబితాలో తన పేరును చేర్చుకున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. ఇది నకిలీ పత్రాల ద్వారా జరిగిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ నారంగ్ కోర్టుకు తెలిపారు.

గాంధీ కుటుంబ సభ్యులైన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీతో పాటు సోనియా పేరును చేర్చినట్లు తెలిపారు. అప్పటికి ఆమె ఇంకా ఇటలీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు తెలిపారు. దీనిపై అప్పుడు విమర్శలు వచ్చినట్లు పేర్కొన్నారు.

అయితే, ఎన్నికల సంఘం ఈ అవకతవకలను గుర్తించి 1982లో ఓటరు జాబితా నుంచి ఆమె పేరును తొలగించిందని ఆయన వాదించారు. తిరిగి ఆమెకు 1983లో పౌరసత్వం లభించిన తర్వాతే జాబితాలో పేరు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ వాదనలను పరిశీలించిన రౌస్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా, ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
Sonia Gandhi
Sonia Gandhi voter list
Delhi court
Indian citizenship
Rouse Avenue court
Vikas Tripathi

More Telugu News