అవినీతి చక్రవర్తి, లక్షల కోట్లు కూడబెట్టిన ఏకైక సీఎం ఆయనే: చంద్రబాబుపై రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శలు

  • మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ఊరుకోబోమన్న రవీంద్రనాథ్‌రెడ్డి 
  • పేదల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వ్యాఖ్య
  • రాష్ట్రంలో బ్రిటీష్ పాలన కంటే ఘోరమైన పరిస్థితి ఉందని విమర్శ
రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న వార్తలపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. ఈ నిర్ణయం పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుందని, దీనికి వ్యతిరేకంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు, జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. 

పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు, గ్రామీణ విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవాలనే గొప్ప సంకల్పంతో జగన్ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని రవీంద్రనాథ్‌రెడ్డి గుర్తుచేశారు. అలాంటి కళాశాలలను ప్రైవేటుపరం చేయడం అత్యంత దారుణమని, దీనివల్ల పేద విద్యార్థులు డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకోలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రయోజనాల కోసం తమ పార్టీ ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై రవీంద్రనాథ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యం నడుస్తోందని, దేశంలోనే అతిపెద్ద అవినీతి చక్రవర్తి చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఆయనేనని, ప్రస్తుతం రాష్ట్రంలో బ్రిటిష్ పాలన కంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని దుయ్యబట్టారు.

సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామంటూ టీడీపీ నేతలు విజయోత్సవ సభలు నిర్వహించడం సిగ్గుచేటని రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.



More Telugu News