204 రోజులు పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతంలో ఉన్న వ్యక్తిని జగన్ జిల్లా అధ్యక్షుడిని చేశారు: సోమిరెడ్డి

  • మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్
  • త్వరలో కాకాణి భూదోపిడీని బయటపెడతానని హెచ్చరిక
  • సాగరమాల పనుల్లో అవినీతి ఆరోపణలను ఖండన
నెల్లూరు జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. త్వరలోనే కాకాణికి సంబంధించిన భూదోపిడీని ఆధారాలతో సహా బయటపెడతానని ఆయన సంచలన హెచ్చరిక చేశారు.

గురువారం నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు. తనపైనా, తెలుగుదేశం పార్టీపైనా విమర్శలు చేయనిదే కాకాణికి తిన్నది అరగదని, కొవ్వు పట్టి తనపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. "అవినీతి, అక్రమాలు చేయడంలో కాకాణికి పీహెచ్‌డీ వచ్చింది. 204 రోజులు పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతంలో ఉన్న వ్యక్తిని జగన్ జిల్లా అధ్యక్షుడిని చేశారు" అని సోమిరెడ్డి విమర్శించారు.

వెంకటాచలంలో జరుగుతున్న సాగరమాల జాతీయ రహదారి పనులపై కాకాణి చేస్తున్న ఆరోపణలను సోమిరెడ్డి తోసిపుచ్చారు. "ఆ పనులు ఏఎంఆర్, మేకపాటి సంస్థలు అద్భుతంగా చేస్తున్నాయి. ప్రభుత్వానికి డబ్బులు కట్టి చట్టబద్ధంగానే గ్రావెల్, ఇసుకను తరలిస్తున్నారు. ఆ పనులు చేస్తున్నది మీ పార్టీకి చెందిన వాళ్లే. ఇందులో నా అవినీతి ఎక్కడ ఉంది?" అని ఆయన ప్రశ్నించారు.

తాను ఇప్పుడు కాకాణికి పెద్ద అభిమానిగా మారిపోయానని సోమిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "204 రోజులు అజ్ఞాతంలో గడిపినందుకు కాకాణి గోవర్థన్‌రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను" అని ఆయన పరిహసించారు.



More Telugu News