ఆటగాళ్లు ఆట ఆడితే చాలు... ఆ పని ప్రభుత్వం చూసుకుంటుంది: పాక్ మ్యాచ్‌పై కపిల్ దేవ్

  • ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌పై స్పందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
  • ఈ మ్యాచ్‌ను అనవసరంగా పెద్ద వివాదం చేయొద్దని హితవు
  • ఆటగాళ్లు తమ ఆటపైనే పూర్తిగా దృష్టి సారించాలని సూచన
  • రాజకీయ అంశాలను ప్రభుత్వం చూసుకుంటుందని స్పష్టీక‌ర‌ణ‌
  • యూఏఈపై టీమిండియా గెలుపు అద్భుతమన్న కపిల్
ఆసియా కప్ నేపథ్యంలో ఎంతో ఆసక్తి రేపుతున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌పై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. ఈ మ్యాచ్‌ను ఒక సాధారణ ఆటలాగే చూడాలని, అనవసరంగా దీన్ని పెద్ద వివాదంగా మార్చవద్దని హితవు పలికాడు. ఆటగాళ్లు తమ ఆటపైనే దృష్టి సారించాలని, రాజకీయపరమైన అంశాలను ప్రభుత్వం చూసుకుంటుందని క‌పిల్‌ స్పష్టం చేశాడు.

గురువారం విలేకరులతో మాట్లాడిన కపిల్ దేవ్... "ఆటగాళ్ల పని ఆడటం, గెలవడం. వారు దానిపైనే దృష్టి పెట్టాలి. అంతకుమించి వేరే విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్‌ను పెద్ద రాద్ధాంతం చేయకండి. ప్రభుత్వం తన పని తాను చేస్తుంది, ఆటగాళ్లు తమ పని తాము చేయాలి" అని అన్నాడు.

పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటంపై కొంతకాలంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, బహుళ దేశాలు పాల్గొనే టోర్నమెంట్లలో ఆడేందుకు అనుమతి ఉందని, కానీ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు అవకాశం లేదనే కేంద్ర ప్రభుత్వ విధానానికే కట్టుబడి ఉన్నామని బీసీసీఐ గతంలోనే స్పష్టం చేసింది. 

రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2012-13 తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరగలేదు. కేవలం ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లలోనే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుత 17వ ఆసియా కప్‌కు అధికారికంగా భారతే ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య సంబంధాల కారణంగా టోర్నీని యూఏఈలోని దుబాయ్, అబుదాబి నగరాల్లో నిర్వహిస్తున్నారు.

ఇక, టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో యూఏఈపై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంపై కపిల్ ప్రశంసలు కురిపించాడు. "మన జట్టు చాలా బలంగా ఉంది. అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈసారి కూడా మన జట్టు ట్రోఫీని గెలుచుకుని వస్తుందని ఆశిస్తున్నాను" అని ధీమా వ్యక్తం చేశాడు. 2023లో జరిగిన వన్డే ఫార్మాట్ ఆసియా కప్‌లోనూ టీమిండియానే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 


More Telugu News