Abhishek Sharma: టీ20 క్రికెట్‌లో అభిషేక్ శర్మ అరుదైన రికార్డు

Abhishek Sharma Sets Unique T20 Record
  • ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో యూఏఈపై భారత్ ఘన విజయం
  • ఛేదనలో తొలి బంతికే సిక్స్ బాది చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
  • ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు
  • అభిషేక్‌పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్ సూర్యకుమార్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఆతిథ్య యూఏఈతో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఛేదనలో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాది, ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మాయాజాలంతో యూఏఈ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. కేవలం 2.1 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అతనికి శివమ్ దూబే (3 వికెట్లు) చక్కటి సహకారం అందించడంతో యూఏఈ జట్టు 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. హైదర్ అలీ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే భారీ సిక్స్ కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. కేవలం 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వైస్ కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ (20 నాటౌట్‌) లాంఛనాన్ని పూర్తి చేయడంతో భారత్ కేవలం 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. "వికెట్ ఎలా స్పందిస్తుందో చూడటానికే బౌలింగ్ ఎంచుకున్నాను. మా కుర్రాళ్లు సమష్టిగా రాణించారు. కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అభిషేక్ ఎందుకు ప్రపంచ నంబర్ వన్ బ్యాటరో మరోసారి నిరూపించాడు. లక్ష్యం 200 అయినా, 50 అయినా అతను ఒకేలా ఆడతాడు. అతని ఆటతీరు నమ్మశక్యం కాదు. పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం మేమంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం" అని తెలిపాడు.
Abhishek Sharma
Abhishek Sharma record
Asia Cup 2025
India vs UAE
Kuldeep Yadav
Shubman Gill
Suryakumar Yadav
T20 cricket
Indian cricket team

More Telugu News