Nepal crisis: నేపాల్ సంక్షోభంపై చైనా తొలి స్పందన

China responds to Nepal crisis calls for unity
  • నేపాల్ లోని పార్టీలన్నీ కలిసికట్టుగా ఉండాలన్న చైనా
  • దేశంలో శాంతిభద్రతలు, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని ఆకాంక్ష
  • నేపాల్ లోని తమ పౌరుల భద్రతపై ఆందోళన
పొరుగు దేశమైన నేపాల్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చైనా తొలిసారిగా అధికారికంగా స్పందించింది. దేశంలోని పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి, అంతర్గత సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు పలికింది. దేశంలో శాంతిభద్రతలు, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని ఆకాంక్షించింది.

చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ బీజింగ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నేపాల్‌తో తమకు బలమైన, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. "నేపాల్‌లోని అన్ని రాజకీయ పక్షాలు కలిసికట్టుగా నిలిచి, దేశీయ సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా అక్కడ సామాజిక స్థిరత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాం" అని ఆయన పేర్కొన్నారు. 

అదే సమయంలో, నేపాల్‌లోని చైనా పౌరుల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వారి రక్షణ కోసం తమ రాయబార కార్యాలయం ఇప్పటికే అత్యవసర భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసిందని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా యాప్‌లపై నిషేధం విధించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నేపాల్‌లో యువత, ముఖ్యంగా 'జెన్-జెడ్' తరం చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఈ నిరసనల కారణంగా ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయగా, ప్రభుత్వం కుప్పకూలింది.

రాజీనామా చేసిన ప్రధాని ఓలీ, చైనాకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. ఆయన హయాంలోనే నేపాల్, చైనాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలపడ్డాయి. ఇటీవలే ఆయన చైనాలో పర్యటించి, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం కూలిపోవడానికి కొద్ది రోజుల ముందే ఆయన ఈ పర్యటన ముగించుకున్నారు. అయితే, చైనాకు మిత్రుడైన ఓలీ రాజీనామాపై లిన్ జియాన్ నేరుగా స్పందించకపోవడం గమనార్హం.

Nepal crisis
China
Lin Jian
Nepal political crisis
KP Sharma Oli
China Nepal relations
Social stability
SCO summit
Nepal protests
Gen Z

More Telugu News