AP Govt: ఏపీ యువతకు ఉచిత శిక్షణతో ఉద్యోగాలు.. నెలకు రూ.64 వేల వరకు జీతం

SEEDAP Offers Free Job Training for AP Unemployed Youth
  • సీడాప్, డీడీయూ-జీకేవై ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం
  • శిక్షణ సమయంలో ఉచితంగా భోజనం, హాస్టల్ వసతి కల్పన
  • కోర్సు పూర్తిచేశాక ప్రముఖ కంపెనీలలో ఉద్యోగావకాశాలు
  • ఎంపికైన కోర్సును బట్టి నెలకు రూ.64 వేల వరకు జీతం
  • శిక్షణ కోసం ఐఎస్‌బీతో సీడాప్ ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పిస్తోంది. చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉచితంగా నైపుణ్య శిక్షణనిచ్చి, ప్రముఖ కంపెనీలలో ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్ ఏపీ), దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ-జీకేవై) ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి.

ఉచితంగానే భోజనం, వసతి
ప్రైవేటు సంస్థలలో వేలకు వేలు ఫీజులు చెల్లించి కోర్సులు నేర్చుకోలేని గ్రామీణ యువతను దృష్టిలో ఉంచుకుని ఈ శిక్షణను రూపొందించారు. ఈ శిక్షణలో చేరే యువతీ యువకులకు ఎటువంటి ఫీజు ఉండదు. అంతేకాకుండా, శిక్షణ కాలంలో ఉచితంగా భోజనం, హాస్టల్ వసతి కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. దీంతో పాటు రెండు జతల యూనిఫామ్, బూట్లు, ఇతర అవసరమైన వస్తువులను కూడా అందిస్తారు.

ప్రస్తుతం వేర్‌హౌస్‌ సూపర్‌వైజర్‌, కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్రొడక్షన్‌ ఇంజినీర్‌, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రీషియన్‌ వంటి పలు కోర్సుల్లో శిక్షణ అందుబాటులో ఉంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గలవారు, పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు ఈ శిక్షణకు అర్హులు. అనుభవజ్ఞులైన శిక్షకులతో 90 రోజుల పాటు తరగతి గదిలో, 30 రోజుల పాటు పరిశ్రమలలో క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తారు. దీంతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ నైపుణ్యాలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు.

శిక్షణ తర్వాత ఉద్యోగం పక్కా
శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన స్కిల్ ఇండియా సర్టిఫికెట్ అందజేస్తారు. అనంతరం విశాఖపట్నం, తిరుపతిలోని శ్రీసిటీ, పుణె వంటి నగరాల్లోని మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఎంచుకున్న కోర్సును బట్టి నెలకు రూ.36,000 నుంచి రూ.64,000 వరకు జీతం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఈ కార్యక్రమంపై సీడాప్ ఛైర్మన్ దీపక్‌రెడ్డి మాట్లాడుతూ, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. దాదాపు 24 రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వివరించారు. గతంలో సెంచూరియన్ యూనివర్సిటీతో కూడా ఒప్పందం చేసుకున్నామని గుర్తుచేశారు.

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 6303000080, 9491070295, 9492572737, 9912459533 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
AP Govt
AP Youth
Andhra Pradesh
free training
employment opportunities
SEEDAP
DDU-GKY
skill development
job training
Centurion University
Indian School of Business

More Telugu News