Renu Agarwal: కూకట్‌పల్లిలో దారుణం: కుక్కర్‌తో యజమానురాలిని కొట్టి చంపి.. ఇంట్లోనే స్నానం చేసి పరార్!

Kukatpally Woman Renu Agarwal Murdered by Cook in Robbery Attempt
  • కూకట్‌పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో మహిళ దారుణ హత్య
  • వంట మనిషిగా చేరిన 11 రోజులకే యజమానురాలిని చంపిన యువకుడు
  • ఇంట్లోని బంగారం, నగదు దోచుకుని ద్విచక్ర వాహనంపై పరారీ 
నమ్మకంగా ఇంట్లో పనికి పెట్టుకున్న వంట మనిషే యజమానురాలి పాలిట యముడయ్యాడు. అత్యంత సురక్షితమైనదిగా భావించే గేటెడ్ కమ్యూనిటీలో ఓ మహిళను అతి కిరాతకంగా హతమార్చి, భారీగా బంగారం, నగదు దోచుకెళ్లిన ఉదంతం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర కలకలం రేపింది. హత్య చేసిన తర్వాత నిందితులు ఏమాత్రం భయం లేకుండా అక్కడే స్నానం చేసి, యజమానురాలి వాహనంపైనే పరారవడం వారి తెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది.

కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రాకేశ్ అగర్వాల్, రేణు అగర్వాల్ (50) దంపతులు తమ కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఫతేనగర్‌లో స్టీలు దుకాణం ఉంది. 11 రోజుల క్రితం ఝార్ఖండ్‌కు చెందిన హర్ష అనే యువకుడిని వంట మనిషిగా పనిలో పెట్టుకున్నారు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణు అగర్వాల్‌ను లక్ష్యంగా చేసుకున్న హర్ష, మరో వ్యక్తితో కలిసి ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

ముందుగా ఆమె చేతులు, కాళ్లను తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం వంటగదిలోని ప్రెషర్ కుక్కర్‌తో ఆమె తలపై బలంగా కొట్టడంతో రేణు అగర్వాల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత ఇంట్లోని బీరువాలో ఉన్న బంగారం, నగదును దోచుకున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత నిందితులు అదే ఇంట్లో స్నానం చేసి, రేణు అగర్వాల్‌కు చెందిన ద్విచక్ర వాహనంపై పరారయ్యారు.

మృతురాలి బంధువుల ఇంట్లో తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న రోషన్ అనే వ్యక్తి... తన గ్రామస్థుడైన హర్షను వీరికి పరిచయం చేసి పనిలో కుదిర్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
Renu Agarwal
Kukatpally murder
Hyderabad crime
Swarn Lake Community
Harsha Jharkhand
murder for robbery
cooker murder case
gated community crime
Hyderabad police
crime news

More Telugu News