Rohit Sharma: హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్.. రోహిత్ శర్మ పోస్టుతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Rohit Sharma is Back Fans Excited by Post
  • మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా వన్డే కెప్టెన్ 
  • సోషల్ మీడియాలో తన ట్రైనింగ్ ఫోటోలు పంచుకున్న హిట్‌మ్యాన్
  • ఆనందంలో అభిమానులు, ఆసక్తికర కామెంట్లు
  • అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సన్నద్ధం
  • ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్
టీమిండియా వన్డే కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ప్రాక్టీస్ షురూ చేశాడు. బుధవారం తన ప్రాక్టీస్‌ సెషన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను హిట్‌మ్యాన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

రోహిత్ పోస్ట్ చేసిన మొదటి ఫొటోలో మైదానంలో వర్కౌట్లు చేస్తుండగా, మరో ఫొటోలో బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం ప్యాడ్లు కట్టుకుని సిద్ధమవుతూ కనిపించాడు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన ఆటగాడు మళ్లీ మైదానంలోకి రావడంతో సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "మిమ్మల్ని మైదానంలో చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం!" అని ఒక అభిమాని వ్యాఖ్యానించగా, "2027 ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్నారు" అని మరో అభిమాని కామెంట్ చేశారు.

ఇటీవలే టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపై ఆయన వన్డే క్రికెట్‌పైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం రోహిత్ ఇప్పుడు సన్నద్ధమవుతున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా ఆడనున్నాడు. వీరిద్దరూ ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమయ్యారు.

వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకు 273 వన్డే మ్యాచ్‌లలో 11,168 పరుగులు సాధించాడు. ఇందులో 32 సెంచరీలు, 58 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై హిట్‌మ్యాన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. అక్కడ 30 మ్యాచ్‌లలో 5 సెంచరీలతో సహా 1,328 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రాబోయే సిరీస్‌లో రోహిత్ ఎలా రాణిస్తాడోనని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Rohit Sharma
Indian Cricket
Hitman
ODI Cricket
Virat Kohli
Australia
Cricket Practice
2027 World Cup
ODI Series
Cricket Retirement

More Telugu News