Jogulamba Gadwal: వ్యవసాయ కూలీలపై పిడుగు .. ముగ్గురు దుర్మరణం

Jogulamba Gadwal District Three Agricultural Laborers Died in Lightning Strike
  • జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన 
  • ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతితో అయిజ మండలంలో విషాదశ్చాయలు
  • పిడుగుపాటుకు మరో నలుగురికి గాయాలు
ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద తలదాచుకోవద్దని వాతావరణ శాఖ అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తుంటారు. అయినా ఆ విషయంపై అవగాహన లేని ముగ్గురు వ్యవసాయ కూలీలు వర్షం పడుతున్న సమయంలో తాటి చెట్టు కింద తలదాచుకుని మృత్యువాత పడిన విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రం, గద్వాల జోగులాంబ జిల్లా, అయిజ మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. భూంపూర్‌ గ్రామానికి చెందిన సర్వేశ్ (19), పార్వతి (40), పులికల్‌ గ్రామానికి చెందిన సౌభాగ్య (38) అక్కడి ఓ రైతు పొలంలో కూలీ పనులకు వెళ్లారు. నిన్న మధ్యాహ్నం సమయంలో వర్షం మొదలవడంతో వారు తాటి చెట్టు కింద తలదాచుకునేందుకు వెళ్లారు. అదే సమయంలో మిగిలిన నలుగురు - జ్యోతి, రాజు, కావ్య, తిమ్మప్ప - చెట్టుకు దూరంగా ఉండగా, ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడింది. పిడుగుపాటుతో చెట్టు కింద ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈ విషాద ఘటనతో అయిజ మండలం ఉలిక్కి పడింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సంబంధిత నివేదికను సిద్ధం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. 
Jogulamba Gadwal
Telangana rains
lightning strike
agricultural laborers
Aiza mandal
weather warning
rain safety
Sarvesh
Parvati
Soubhagya

More Telugu News