PM Modi: మోదీ హయాంలో ఏ దేశంలో ఎందరు ప్రధానులు మారారో తెలుసా?

Narendra Modi 11 Years vs Prime Minister Changes Worldwide
  • 11 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోదీ
  • పలు దేశాల్లో తరచూ మారుతున్న ప్రభుత్వాధినేతలు
  • నేపాల్‌లో 11 ఏళ్లలో 9 సార్లు ప్రధానుల మార్పు
  • యూకేలో ఆరుగురు, పాకిస్థాన్‌లో ఏడుగురు పీఎంలు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆసక్తికర పోస్ట్
  • మోదీకి 75 శాతం ప్రజాదరణ.. సర్వేలో వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఆయన సుదీర్ఘ పాలనా కాలాన్ని ఇతర దేశాల్లోని రాజకీయ స్థిరత్వంతో పోలుస్తూ ఈ పోస్ట్‌ను రూపొందించారు. భారతదేశంలో 11 ఏళ్లుగా నరేంద్ర మోదీ స్థిరంగా ప్రధానమంత్రిగా కొనసాగుతుండగా, ఇదే సమయంలో ప్రపంచంలోని అనేక ప్రధాన దేశాల్లో ప్రభుత్వాధినేతలు తరచూ మారిపోయారని ఇందులో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వివరాల ప్రకారం, గత 11 ఏళ్లలో నేపాల్‌లో 9 మంది, యూకేలో ఆరుగురు, పాకిస్థాన్‌లో ఐదుగురు ప్రధానులు మారారు. అలాగే జపాన్‌లో ముగ్గురు, అమెరికాలో నలుగురు అధ్యక్షులు, శ్రీలంకలో నలుగురు దేశాధినేతలు మారారని ఆ పోస్ట్‌లో వివరించారు. ఈ పోస్ట్‌లోని లెక్కలను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వాల మార్పు సంఖ్య దాదాపుగా సరైనదే అయినా, కొందరు నేతలు ఒకటి కంటే ఎక్కువసార్లు పదవులు చేపట్టారు.

ఉదాహరణకు, నేపాల్‌లో 9 సార్లు ప్రభుత్వాలు మారినప్పటికీ, ప్రధానులుగా పనిచేసింది నలుగురే. వారిలో ప్రచండ, షేర్ బహదూర్ దేవ్‌బా మూడేసి సార్లు ప్రధాని అయ్యారు. పాకిస్థాన్‌లో ఆపద్ధర్మ ప్రధానులతో కలిపి ఏడుగురు మారారు. ఇక యూకేలో డేవిడ్ కామెరాన్ నుంచి ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ వరకు ఆరుగురు ప్రధానులు మారారు. జపాన్‌లో షింజో అబే సహా నలుగురు, శ్రీలంకలో ఐదుగురు, అమెరికాలో బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ముగ్గురు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇక, ఈ పోస్ట్‌లో ప్రస్తావించినట్లు ప్రధాని మోదీ ప్రజాదరణ ఇప్పటికీ 70 శాతానికి పైగా ఉందన్న ప్రచారంలో వాస్తవం ఉందని తేలింది. అమెరికాకు చెందిన బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' ఈ ఏడాది జూలైలో నిర్వహించిన సర్వేలో, నరేంద్ర మోదీ 75 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మొదటి స్థానంలో నిలిచారు.
PM Modi
Modi government
Prime Ministers
Political stability
Nepal
UK
Pakistan
Global leaders

More Telugu News