తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

  • వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
  • ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి వర్షాలు
  • నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, రానున్న నాలుగు రోజులు హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈరోజు ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదిలా ఉండగా, ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో నగరవాసులు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. అయితే, భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


More Telugu News