డిప్యూటీ సీఎం ఫొటో పెట్టొద్దని ఎక్కడుంది?.. పిటిషనర్‌ను ప్రశ్నించిన ఏపీ హైకోర్టు

  • ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ ఫొటో ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో పిటిషన్
  • పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు
  • వ్యాజ్యం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని అభిప్రాయం
  • కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని తీవ్ర వ్యాఖ్యలు
  • డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం లేదని స్పష్టీకరణ
ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో వేసినట్లుగా ఉందని అభిప్రాయపడిన న్యాయస్థానం, దానిని కొట్టివేస్తున్నట్లు బుధవారం స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం ఫొటో పెట్టకూడదని చెప్పేందుకు చట్టపరమైన నిబంధనలు ఎక్కడ ఉన్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫొటో ప్రదర్శనకు చట్టబద్ధమైన అనుమతులు లేవని, దీనిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం రూపొందించే వరకు ఆ ఫొటోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని రైల్వే విశ్రాంత ఉద్యోగి వై. కొండలరావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు, పవన్ కల్యాణ్‌ను కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు.

విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిజమైన ప్రజా ప్రయోజనాలు ఉన్న వ్యాజ్యాలను మాత్రమే న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకుంటాయని స్పష్టం చేసింది. రాజకీయ లక్ష్యాలను సాధించుకోవడానికి కోర్టులను ఒక వేదికగా మార్చుకోవడం సరైన పద్ధతి కాదని హితవు పలికింది. సమాజానికి మేలు చేసే అంశాలపై దృష్టి సారించాలని, అనవసర వ్యాజ్యాలతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని సూచిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.


More Telugu News