ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి కవిత మద్దతు

  • సుదర్శన్ రెడ్డి గెలిస్తే ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారన్న కవిత
  • సుదర్శన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నానని వ్యాఖ్య
  • ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించిన బీఆర్ఎస్
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కూడా అంజలి ఘటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిస్తే ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని ఆమె అన్నారు. అయితే, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

ఆమె ఇంకా మాట్లాడుతూ, కేసీఆర్ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకువెళతామని ఆమె అన్నారు. ఉన్నతమైన ఆశయాలతో అడుగు వేయాలని ఆలోచిస్తున్నామని అన్నారు. ఉన్నతమైన లక్ష్యం దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

సామాజిక తెలంగాణ సాధించే వరకు జాగృతి కార్యకర్తలు విశ్రమించబోరని అన్నారు. సామాజిక తెలంగాణ కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని ఆమె అన్నారు. కాళోజీ స్ఫూర్తితోనే అందరమూ పనిచేశామని, ఇక ముందు కూడా పనిచేస్తామని కవిత అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో అందరూ విజృంభించి అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అన్నారు.


More Telugu News