Santosh Babu: తెలుగు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్... 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' చిత్రం ప్రారంభం

Salman Khan to play Santosh Babu in Battle of Galwan
  • 2020లో భారత్-చైనా బలగాల మధ్య గల్వాన్ లోయలో ఘర్షణలు 
  • వీరమరణం పొందిన తెలుగు కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు
  • 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరుతో తెరకెక్కుతున్న సినిమా
  • సల్మాన్ పధాన పాత్రలో అపూర్వ లఖియా దర్శకత్వంలో చిత్రం
  • ప్రస్తుతం లడఖ్‌లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా పనులను ప్రారంభించారు. 2020లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల ఆధారంగా 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్.. గల్వాన్ ఘర్షణలో వీరమరణం పొంది, మహావీర చక్ర పురస్కారం అందుకున్న తెలుగు వీరుడు కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పాత్రను పోషిస్తున్నారు. అపూర్వ లఖియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం లడఖ్‌లో జరుగుతున్న షూటింగ్ నుంచి సల్మాన్ ఖాన్ ఫొటో ఒకటి బయటకు వచ్చి వైరల్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

ప్రస్తుతం చిత్రబృందం లడఖ్, లేహ్ ప్రాంతాల్లో సినిమాకు అత్యంత కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. లడఖ్‌లో వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు కాబట్టి, అత్యంత ముఖ్యమైన యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలను మొదటి షెడ్యూల్‌లోనే పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. రాబోయే రెండు, మూడు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది.

లడఖ్‌లో షూటింగ్ చేయడం చాలా కఠినంగా ఉందని సల్మాన్ ఖాన్ స్వయంగా తెలిపారు. ఎత్తైన ప్రదేశం, గడ్డకట్టే చల్లటి నీళ్లలో యాక్షన్ సీన్లు చేయడం పెద్ద సవాల్ అని అన్నారు. ఈ పాత్ర కోసం పరిగెత్తడం, పోరాట సన్నివేశాల్లో పాల్గొనడం వంటివి ఉన్నందున ఎక్కువ సమయం శిక్షణ తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో సల్మాన్ సైనికుడి యూనిఫాంలో దేశభక్తి ఉప్పొంగుతున్న తీరులో కనిపించారు. 'సికందర్' తర్వాత ఈ సినిమా సల్మాన్‌కు బలమైన కమ్‌బ్యాక్ ఇస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' సినిమా షూటింగ్‌తో పాటు సల్మాన్ ఖాన్ 'బిగ్‌బాస్ 19' షోను కూడా సమన్వయం చేసుకుంటున్నారు. ఆగస్టు 24న జియోహాట్‌స్టార్, కలర్స్ టీవీలో ప్రారంభమైన ఈ షోలో, ఆయన 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ సినిమా, టీవీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు.
Santosh Babu
Salman Khan
Battle of Galwan
Galwan Valley clash
India China conflict
Colonel Bikkumalla Santosh Babu
Apoorva Lakhia
Ladakh shooting
Bollywood movie
Sikandar movie

More Telugu News