సాధారణంగా చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన సినిమాలు భారీ వసూళ్లను రాబట్టడమనేది మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ సారి కన్నడ ఇండస్ట్రీ నుంచి అలాంటి ఒక రేర్ ఫీట్ జరిగింది. ఆ సినిమా పేరే 'సు ఫ్రమ్ సో'. జులై 25వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. దర్శకుడు జేపీ తుమినాడ్ అల్లుకున్న ఈ కథ, ఏ అంశం చుట్టూ తిరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: అది మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉండే ఒక మారుమూల గ్రామం. అక్కడ కష్టపడి పనిచేసేవారు తక్కువ. కబుర్లతో కాలక్షేపం చేసే తాగుబోతులు ఎక్కువ. అలాంటి ఆ ఊరికి రవీంద్ర (షానీల్ గౌతమ్) పెద్దగా ఉంటాడు. మంచివాడు .. ధైర్యవంతుడు అనే పేరు ఆయనకి ఉంటుంది. నడి వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా, ఊళ్లో ప్రతి కార్యక్రమానికి ముందు నిలబడుతూ ఉంటాడు. పెత్తనం .. పెద్దరికం తమకి అందకుండా చేస్తున్న అతనిపై చాలా మందికి జలస్ ఉంటుంది. 

ఇక అదే ఊళ్లో అశోక్ ( జేపీ తిమినాడ్) నివసిస్తూ ఉంటాడు. ఆ విలేజ్ అమ్మాయిల ముందు రవీంద్ర హీరోయిజాన్ని భరించలేని యువకులలో అతను కూడా ఒకడు. అలాంటి అతని కంట్లో ఒక అందమైన యువతి పడుతుంది. టౌన్లో చదువుకుంటూ ఆ ఊరికి వచ్చిన ఆమె పట్ల అతను  ఆకర్షితుడవుతాడు. స్నానాల గదిలో ఉన్న ఆమెను రహస్యంగా చూడటానికి ప్రయత్నిస్తాడు. అటుగా వచ్చినవారికి తనపై అనుమానం రాకుండా ఉండటం కోసం తనకి దెయ్యం పట్టనట్టుగా ప్రవర్తిస్తాడు. 

అశోక్ ఆడిన అబద్ధం వలన, అతనికి 'సులోచన' అనే దెయ్యం పట్టిందనే నిర్ణయానికి ఆ ఊళ్లోని వాళ్లంతా వస్తారు. అశోక్ ను ఒక గదిలో బంధిస్తారు. అతనికి పట్టిన దెయ్యాన్ని వదిలించడం కోసం, మాంత్రికుడైన కరుణాకర్ గురూజీ(రాజ్ బీ శెట్టి)ని కర్ణాటక నుంచి పిలిపిస్తారు. గురూజీ అడుగుపెట్టిన తరువాత అక్కడ ఏం జరుగుతుంది? అశోక్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.
              
విశ్లేషణ
: ఈ మధ్య కాలంలో ఏ భాషలో చూసినా విలేజ్ నేపథ్యంతో కూడిన కథలు తెరపైకి ఎక్కువగా వస్తున్నాయి. చాలావరకూ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుందని చెప్పచ్చు. ఒక విలేజ్ కి చెందిన యువకుడు ఒక తప్పు చేస్తూ దొరికిపోతాడు. విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం, తనకి దెయ్యం పట్టినట్టుగా నటిస్తాడు. ఫలితంగా అతను ఎలాంటి చిక్కుల్లో పడతాడనేది దర్శకుడు చూపించిన తీరు హాయిగా నవ్విస్తుంది.  

మారుమూల ప్రాంతాలలో ఉండేవారికి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. దెయ్యాలు .. భూతాలు .. పిశాచాలు ఉన్నాయని బలంగా నమ్ముతూ ఉంటారు. తాము చూశామని చుట్టూ ఉన్నవారికి చాలా బలంగా చెబుతూ ఉంటారు. నాలుగు ముక్కలు చదువుకున్నవాళ్లు తమ తెలివి తేటలు చూపించడానికి ట్రై చేస్తూ ఉంటే, భయాన్ని కప్పిపుచ్చుకుంటూ ధైర్యాన్ని ప్రదర్శించేవారు మరికొందరు. ఇలా ఒక గ్రామంలో సహజంగా కనిపించే స్వభావాలను ఆవిష్కరించడంలో దర్శకుడు ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. 

విలేజ్ నేపథ్యంలో అల్లుకున్న ఈ కథలో, ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అమాయకత్వంతో కూడిన వాళ్ల మేనరిజమ్స్ ఈ కథలో కీలకంగా నిలుస్తాయి. అక్కడక్కడా సరదాగా నవ్వుకునేలా చేస్తాయి. 'సు ఫ్రమ్ సో' అంటూ టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన దర్శకుడు, టైటిల్ విషయంలో ఇచ్చిన క్లారిటీ కూడా మెప్పిస్తుంది. ఈ మధ్య కాలంలో విలేజ్ నేపథ్యంలో వచ్చిన ఒక మంచి ఎంటర్టైనర్ గా ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు. 

పనితీరు: నిజానికి ఇలాంటి ఒక కథను తయారు చేసుకోవడం,పల్లెటూరు మనుషుల స్వభావాలకి తగినట్టుగా ఆయా పాత్రలను డిజైన్ చేసుకోవడం చాలా కష్టమైన విషయం. సహజత్వానికి దగ్గరగా ఆ సన్నివేశాలను ఆవిష్కరించడం మరింత కష్టం. ఒక ఆకతాయి పాత్రను అర్థవంతంగా మారుస్తూ, ఈ కాన్సెప్ట్ ను వినోదభరితంగా అందించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. 

ఇక దర్శకుడు తుమినాడ్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించాడు. నటన పరంగా కూడా ప్రేక్షకులను మెప్పించాడు. ఇక దెయ్యాన్ని వదిలించే మాంత్రికుడిగా రాజ్ బి శెట్టి నటన ఆకట్టుకుంటుంది. ఊరు పెద్దగా చేసిన షానిల్ గౌతమ్, ఆ తరహా స్వభావం ఉన్నవారిని మనకి గుర్తుచేస్తాడు. చంద్రశేఖరన్ ఫొటోగ్రఫీ .. సందీప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. నితిన్ ఎడిటింగ్ ఎడిటింగ్ ఈ కథను మరింత పట్టుగా పరిగెత్తిస్తాయి. 

ముగింపు: విలేజ్ వాతావరణం .. అక్కడి మనుషులు .. వారి స్వభావాలు .. వ్యసనాలు .. మూఢ నమ్మకాలు .. ప్రచారాలు .. వీటన్నినికి కారణమైన వారి అమాయకత్వంలో నుంచి అనుకున్నంత కామెడీని పిండుకోవచ్చని మరోసారి నిరూపించిన సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడదగిన కంటెంట్ ఇది.