Maddi Vinay Purushottam: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం.. ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచిన ఎంటెక్ విద్యార్థి

Professor Attacked by Student at RGUKT Nuzvid
  • పరీక్షకు నిరాకరించడంతో దారుణానికి పాల్పడిన విద్యార్థి
  • ప్రొఫెసర్ గోపాలరాజుకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
  • నిందితుడు వినయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు 
  •  హాజరు శాతం తక్కువగా ఉండటమే ఘటనకు కారణమని వెల్లడి
  •  ఘటనను తీవ్రంగా ఖండించిన మంత్రి నారా లోకేశ్
పరీక్ష రాసేందుకు అనుమతించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థి తన గురువుపైనే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నూజివీడు ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) క్యాంపస్‌లో నిన్న జరిగింది. ఈ దాడిలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ గోపాలరాజు తీవ్రంగా గాయపడ్డారు.

విజయనగరం జిల్లాకు చెందిన మద్ది వినయ్ పురుషోత్తమ్ ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నిబంధనల ప్రకారం అతడికి అవసరమైనంత హాజరు శాతం (74 శాతం) నమోదు కాలేదు. ఈ కారణంగా అతడిని పరీక్షలకు అనుమతించబోమని అధికారులు ముందే స్పష్టం చేశారు. ఈ క్రమంలో నిన్న ఉదయం ల్యాబ్ పరీక్ష జరుగుతుండగా వినయ్ పరీక్ష హాలుకు వచ్చాడు.

పరీక్ష పర్యవేక్షణలో ఉన్న ప్రొఫెసర్ గోపాలరాజు నిబంధనల ప్రకారం వినయ్‌ను పరీక్ష రాసేందుకు నిరాకరించారు. అయినా వినయ్ అక్కడే ఉండిపోవడంతో అతడిని బయటకు పంపించాలని ప్రొఫెసర్ సెక్యూరిటీ సిబ్బందిని పిలిచారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వినయ్ వెంట తెచ్చుకున్న కత్తితో ప్రొఫెసర్ గోపాలరాజుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అప్రమత్తమైన తోటి విద్యార్థులు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ప్రొఫెసర్ మెడ, చెయ్యి, నుదిటిపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు వినయ్‌ను అరెస్ట్ చేసి, అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

క్రమశిక్షణ లేమిని సహించం: మంత్రి లోకేశ్
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు. "విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకం. ఏ అధ్యాపకుడూ విద్యార్థి జీవితాన్ని పాడుచేయాలని భావించరు. విద్యార్థుల్లో ఇలాంటి హింసా ప్రవృత్తి, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు" అని స్పష్టం చేశారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
Maddi Vinay Purushottam
Nuzvid Triple IT
RGUKT
Professor Gopal Raju
Andhra Pradesh
student attack
exam denial
Nara Lokesh
crime news

More Telugu News