రైలుకింద పడి ప్రియురాలు.. బావిలో దూకి ప్రియుడు.. ప్రేమజంట విషాదాంతం

  • ప్రియుడితో ఫోన్లో మాట్లాడిన కాసేపటికే రైలు కిందపడ్డ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
  • ఆమె మరణవార్త విని తట్టుకోలేక బావిలో దూకిన ప్రియుడు
  • 'ఆమె లేనిదే నేను జీవించలేను' అంటూ సూసైడ్ నోట్
  • మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రేమజంటగా పోలీసుల గుర్తింపు
ఓ ప్రేమ జంట ఒకరి తర్వాత ఒకరుగా తమ జీవితాలను ముగించుకున్న విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేకపోయిన ప్రియుడు, ఆమె చనిపోయిన మరుసటి రోజే ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచల్మ గ్రామానికి చెందిన హితవర్షిణి (20) ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. సెలవుల అనంతరం ఆదివారం తిరిగి కళాశాలకు బయలుదేరిన ఆమె రాత్రి 7:40 గంటల సమయంలో తన ప్రియుడు వినయ్‌తో ఫోన్‌లో మాట్లాడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఘట్‌కేసర్-బీబీనగర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలుకింద పడి ప్రాణాలు తీసుకుంది. ఆమె వద్ద దొరికిన ఐడీ కార్డు, ఫోన్ ఆధారంగా పోలీసులు మృతురాలి వివరాలు కనుగొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

హితవర్షిణి మరణవార్త ఆమె స్వగ్రామంలో ఉన్న ప్రియుడు వినయ్‌ (28)ను తీవ్రంగా కలచివేసింది. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేని అతడు సోమవారం లక్షెట్టిపేట మండల శివారులోని ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 'ఆమె లేనిదే నేను జీవించలేను' అని అతడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హితవర్షిణి ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్న సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు ఆమె చివరిసారిగా వినయ్‌తో మాట్లాడినట్టు గుర్తించారు. ఈ క్రమంలో అతడి గురించి ఆరా తీయగా, వినయ్ కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలకు ప్రేమ వ్యవహారమే కారణమని సూసైడ్ నోట్ ఆధారంగా భావిస్తున్నట్టు తెలిపారు. మృతుడు వినయ్ తల్లి రాజవ్వ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ వెల్లడించారు. ఒకే గ్రామానికి చెందిన యువతీయువకులు ఇలా ప్రాణాలు తీసుకోవడంతో వారి స్వగ్రామం కొర్విచల్మలో విషాదఛాయలు అలముకున్నాయి.


More Telugu News