ప్రజలు మోసపోవడం ఇక ఆగిపోతుంది... వైసీపీపై అశోక్ బాబు ఫైర్

  • సాక్షి పత్రిక కథనంపై టీడీపీ నేత పర్చూరి అశోక్ బాబు తీవ్ర ఆగ్రహం
  • చంద్రబాబు హయాంలోనే 11 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయని వెల్లడి
  • వైసీపీ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శ
  • నిధుల్లో 84 శాతం పులివెందులకే మళ్లించారని సంచలన ఆరోపణలు
  • మెడికల్ కాలేజీల వ్యయంపై బహిరంగ చర్చకు రావాలని జగన్‌కు సవాల్
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై వస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. 15 ఏళ్లలో చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు మండిపడ్డారు. సోమవారం నాడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల స్థాపన, వాటికి చేసిన వ్యయంపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారు.

చంద్రబాబు హయాంలోనే వైద్యరంగానికి పటిష్టమైన పునాదులు పడ్డాయని అశోక్ బాబు గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 27 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని, 2014-19 మధ్య కాలంలోనే 6 ప్రైవేట్, 5 ప్రభుత్వ రంగంలో కలిపి మొత్తం 11 కొత్త కాలేజీలు ప్రారంభమయ్యాయని ఆయన వివరించారు. "మెడికల్ కాలేజీ అంటే కేవలం బోర్డు తగిలించడం కాదు. దానికి అనుబంధంగా ఆసుపత్రులు, పడకలు, ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతులు కల్పించాలి. ఈ కనీస అవగాహన కూడా వైసీపీ నేతలకు లేదు," అని ఆయన ఎద్దేవా చేశారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయగా, వాటి అంచనా వ్యయం రూ.8,480 కోట్లు అని అశోక్ బాబు తెలిపారు. ఇందులో కేంద్రం ఇప్పటికే రూ.975 కోట్లు విడుదల చేసినా, జగన్ ప్రభుత్వం కేవలం రూ.465 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు. మొత్తం ఖర్చు చేసిన రూ.1,451 కోట్లలో 84 శాతం నిధులను కేవలం పులివెందుల కాలేజీకే మళ్లించారని, మిగతా కాలేజీలను అసంపూర్తిగా వదిలేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. సరైన ఫ్యాకల్టీ లేని కారణంగా మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పాడేరు వంటి కాలేజీలను మెడికల్ కౌన్సిల్ తిరస్కరించిందని అన్నారు.

"రాళ్లు వేసి, బోర్డులు పెట్టి ప్రజలను మోసం చేయడం వైసీపీకి అలవాటుగా మారింది. జగన్ నాడు కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టకుండా, టీడీపీ ప్రారంభించిన పనులకే తన పేరు పెట్టుకుని ప్రచారం చేసుకున్నారు" అని అశోక్ బాబు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా అవినీతి, అబద్ధాలతో నిండిపోయిందని, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని, వైసీపీ విష ప్రచారాలను ప్రజలు ఇక నమ్మరని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News