భారత్‌ను చూసి నేర్చుకోండి.. మోదీ పాలసీపై ఇజ్రాయెల్ నిపుణుడి ప్రశంసలు

  • 'దేశ గౌరవం'ను వ్యూహాత్మక ఆస్తిగా మార్చుకోవడంలో మోదీ విజయం సాధించారన్న జకి షలోమ్
  • ట్రంప్ ఫోన్ కాల్స్‌ను కూడా తిరస్కరించిన మోదీ వైఖరిపై ప్రశంసలు
  • ఇజ్రాయెల్ స్పందన గందరగోళంగా ఉంటోందని నిపుణుడి విమర్శ
అంతర్జాతీయ సంబంధాల్లో 'దేశ గౌరవాన్ని' ఒక వ్యూహాత్మక ఆస్తిగా ఎలా కాపాడుకోవాలో భారత్‌ నుంచి ఇజ్రాయెల్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశానికి చెందిన ప్రముఖ రక్షణ రంగ నిపుణుడు జకి షలోమ్‌ అభిప్రాయపడ్డారు. మిస్‌గవ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ సెక్యూరిటీలో సీనియర్‌ ఫెలోగా పనిచేస్తున్న ఆయన, ‘జెరూసలెం పోస్ట్‌’కు రాసిన ఒక వ్యాసంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని కొనియాడారు.

పాకిస్థాన్‌తో ఘర్షణలు, అమెరికా విధించిన టారిఫ్‌ల వంటి క్లిష్ట సమయాల్లో ప్రధాని మోదీ దృఢమైన వైఖరిని ప్రదర్శించారని షలోమ్‌ గుర్తుచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను కూడా మాట్లాడేందుకు నిరాకరించడం ద్వారా, తన దేశ గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారనే బలమైన సందేశాన్ని మోదీ పంపారని ఆయన వివరించారు. "దేశ గౌరవం అనేది కేవలం విలాసవంతమైన విషయం కాదు, అదొక కీలకమైన వ్యూహాత్మక ఆస్తి. మోదీ చర్యలు కఠినంగా అనిపించినా, భారత్‌ను తక్కువగా చూడటాన్ని అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు" అని షలోమ్‌ తన వ్యాసంలో పేర్కొన్నారు.

మరోవైపు, ఖాన్‌ యూనిస్‌లోని నాస్సెర్‌ ఆసుపత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్ వైఖరి గందరగోళంగా, ఆత్రుతతో కూడుకున్నదిగా ఉందని ఆయన విమర్శించారు. ఇజ్రాయెల్ స్పందన కారణంగా అమాయకులను చంపామన్న సంకేతాలు ప్రపంచానికి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ప్రదర్శిస్తున్న నిబద్ధత, స్పష్టత ఇజ్రాయెల్‌కు ఆదర్శం కావాలని షలోమ్‌ సూచించారు. 


More Telugu News