Teja Sajja: ముంబై ప్రెస్‌మీట్‌లో రాజమౌళి, చిరంజీవిని గుర్తు చేసుకున్న తేజ సజ్జా

Teja Sajja remembers Chiranjeevi Rajamouli at Mumbai press meet
  • రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపిన యంగ్ హీరో తేజ సజ్జా
  • భారతీయ ప్రతిభకు జక్కన్న ప్రపంచ వేదిక చూపించారన్న తేజ
  • ఆయన చిత్రాల వల్లే మాకు అంతర్జాతీయ మార్గం సులభమైందని వ్యాఖ్య
  • విదేశీ ప్రేక్షకులు మన సినిమాలు చూస్తే భారీ బడ్జెట్‌లు వస్తాయన్న తేజ సజ్జా
  • చిరంజీవి ఆరోజు తన ఫొటో సెలక్ట్ చేసినందువల్లే ఈ స్థాయిలో ఉన్నానన్న తేజ సజ్జా
భారతీయ సినిమా ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ, తమలాంటి నవతరం నటులకు అంతర్జాతీయ వేదికపై ఒక మార్గం నిర్మించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి తాను ఎంతో రుణపడి ఉంటానని యంగ్ హీరో తేజ సజ్జా అన్నారు. తన తాజా చిత్రం 'మిరాయ్' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ముంబైలో విలేకరులతో మాట్లాడిన ఆయన, రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పరిమిత వనరులతో సినిమాలు తీసే ధోరణిపై అడిగిన ప్రశ్నకు తేజ బదులిచ్చారు. "ప్రస్తుతం మనకున్న పరిమితుల కారణంగా తక్కువ బడ్జెట్‌లో సినిమాలు తీయాల్సి వస్తోంది. కానీ భవిష్యత్తులో ఈ పరిస్థితి కచ్చితంగా మారుతుంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో రాజమౌళి గారు మా అందరి కోసం ఒక బలమైన బాట వేశారు. ఆయన వల్లే మన సినిమాలకు అంతర్జాతీయ మార్గం సుగమమైంది" అని తేజ వివరించారు.

అంతర్జాతీయ ప్రేక్షకులు మన సినిమాలను థియేటర్లలో చూడటం మొదలుపెట్టినప్పుడు మన చిత్రాలకు కూడా భారీ బడ్జెట్‌లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. "మన భారతీయ ఇతిహాసాలు, సంస్కృతి నుంచి స్ఫూర్తి పొంది అద్భుతమైన కథలను ప్రపంచానికి అందించగల సత్తా మనకుంది. మనం ఇప్పటికే ఎంతో అర్థవంతమైన, మన మూలాలకు దగ్గరగా ఉండే గొప్ప చిత్రాలను తీస్తున్నాం" అని తేజ సజ్జ పేర్కొన్నారు.

కాగా, తేజ కథానాయకుడిగా నటిస్తున్న 'మిరాయ్' ఒక ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో ఆయన ప్రాచీన గ్రంథాలను కాపాడే 'సూపర్ యోధ' పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

చిరంజీవి తన ఫొటో సెలక్ట్ చేశారని వెల్లడి

తాను చిన్నప్పుడు చాలా గొప్ప వ్యక్తుల మధ్య పెరిగానని తేజ సజ్జా తెలిపారు. చిరంజీవి తనను ఎప్పుడూ సొంత పిల్లాడిలా చూసుకునే వారని గుర్తు చేసుకున్నారు. అందుకే ఆయన అంటే తనకు అపారమైన గౌరవం ఉందని ఆయన అన్నారు. 'హనుమాన్' సినిమా చూశాక తనకు ఫోన్ చేసి సుమారు 20 నిమిషాలు మాట్లాడారని తెలిపారు. భవిష్యత్తులో ఎలా ఉండాలో కూడా సూచనలు చేశారని తెలిపారు.

'చూడాలని ఉంది' సినిమా చైల్డ్ ఆర్టిస్టుల కోసం వంద ఫొటోలు వస్తే, చిరంజీవి తనను సెలక్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు చిరంజీవి తన ఫొటోను సెలక్ట్ చేయకపోయి ఉంటే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదని వ్యాఖ్యానించారు. తనకు సినీ నేపథ్యం లేదని, అందుకే తాను హీరో అవుతానంటే అందరూ భయపడేవారని తెలిపారు. 'ఓ బేబీ' సినిమా సమయంలో తాను అందరికీ తెలియాలని సమంత ప్రతిచోటుకు తనను పంపించి మద్దతుగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు.

సినిమా పరిశ్రమకు వచ్చి తాను ఎన్నో కష్టాలు పడ్డానని తెలిపారు. అవమానాలు, తిరస్కరణలు, మోసాలు అన్నీ చూశానని, అన్ని ఒడిదుడుకులు చూశాను కాబట్టే తనపై తనకు నమ్మకం పెరిగిందని అన్నారు. తనను మోసం చేసిన వాళ్లలో పెద్దమనుషులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఒకసారి తనకు స్టార్ దర్శకుడు ఒకరు కథ చెప్పి షూటింగ్ స్టార్ట్ చేశారని, కానీ ఆ సెట్స్‌కు హఠాత్తుగా ఒక హీరో వచ్చాడని తెలిపాడు. హీరోకు సీన్స్ చూపించడం కోసం తనతో మాక్ షూటింగ్ చేశారని ఆ తర్వాత తనకు అర్థమైందని తెలిపారు.
Teja Sajja
Mirai
Rajamouli
Chiranjeevi
Hanuman Movie
Telugu Cinema
Indian Movies
Pan-India Films

More Telugu News