రాహుల్ మాట వింటే దేశం నాశనమే.. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

  • శ్రీనగర్‌లో అశోక చక్రం ఫలకం ధ్వంసంపై రాజకీయ దుమారం
  • రాహుల్ గాంధీ వల్లే దేశంలో అస్థిరత అంటూ గిరిరాజ్ సింగ్ ఆరోపణ
  • బీహార్ డీఎన్‌ఏను అవమానించిన వారిని రాహుల్ ప్రోత్సహించారన్న విమర్శ
  • రాహుల్ దేశాన్ని అవమానిస్తుంటే, మోదీ పేదలను ఆదుకుంటున్నారని వ్యాఖ్య
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జాతీయ చిహ్నమైన అశోక చక్రం ఉన్న ఫలకాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై స్పందిస్తూ దేశంలో అస్థిరతకు, అగౌరవానికి రాహుల్ గాంధీ కారణమవుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు దేశం నడిస్తే అది కుప్పకూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీహార్ నుంచి కశ్మీర్ వరకు దేశాన్ని అగౌరవపరిచేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. పాత రాజకీయ వివాదాలను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. "తేజస్వి యాదవ్, లాలూ యాదవ్‌లను అడుగుతున్నా, బీహార్‌ను ఇంకెన్నిసార్లు అవమానిస్తారు? స్టాలిన్‌ను పిలిపించి తిట్టించారు. బీహార్ డీఎన్‌ఏను అవమానించిన రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. ఇప్పుడు కశ్మీర్‌లో ఏం జరిపించారు?" అని రాహుల్‌ను ఉద్దేశించి నిలదీశారు.

శ్రీనగర్‌లోని హజరత్‌బల్ దర్గాలో జమ్మూకశ్మీర్ వక్ఫ్ బోర్డు చేపట్టిన పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ ఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఈ వివాదం చెలరేగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ సందర్భంగా గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ "అశోక స్తంభం కేవలం బీహార్‌కు చెందిన అశోక చక్రవర్తి స్తంభం మాత్రమే కాదు. దానిని మన రాజ్యాంగం స్వీకరించింది, యావత్ దేశం దాన్ని గౌరవిస్తోంది" అని నొక్కిచెప్పారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి దేశాన్ని అవమానిస్తుంటే, ప్రధాని మోదీ మాత్రం పేదలు, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. 27 కోట్ల మంది పేదలను దారిద్ర్యరేఖ నుంచి పైకి తీసుకువచ్చారని, జీఎస్టీని సులభతరం చేసి పండుగ వేళ పేద కుటుంబాలకు మేలు చేశారని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు.


More Telugu News