ఫేస్‌బుక్‌లో మళ్లీ 'పోక్'ల గోల మొదలు!

  • ఫేస్‌బుక్‌లో 'పోక్' ఫీచర్ మళ్లీ పాప్యులర్
  • ఒకప్పుడు ట్రెండ్‌గా నిలిచిన ఫీచర్‌కు పునరుజ్జీవం
  • స్నేహితుల ప్రొఫైల్‌లోనే ప్రత్యేకంగా 'పోక్' బటన్
  • ఎన్నిసార్లు పోక్ చేశారో చూపేందుకు ప్రత్యేక పేజీ
  • పోక్ ఫీచర్ బలంగా తిరిగొచ్చిందన్న ఫేస్‌బుక్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తన పాత యూజర్లకు బాగా గుర్తుండే 'పోక్' ఫీచర్‌ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. సుమారు దశాబ్దం క్రితం యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ఫీచర్‌కు కొత్త హంగులు అద్ది, మరింత సులభంగా వాడేలా మార్పులు చేసింది. స్నేహితులను సరదాగా కదిలించడానికి, ఆటపట్టించడానికి ఉపయోగపడిన ఈ ఫీచర్ మళ్లీ బలంగా పుంజుకుంటోందని ఫేస్‌బుక్ అధికారికంగా ప్రకటించింది.

2010లలో ఫేస్‌బుక్‌లో 'పోక్' ఒక పెద్ద ట్రెండ్. ఒకరినొకరు పలకరించుకోవడానికి, సరదాగా ఏడిపించడానికి, కొందరైతే ఫ్లర్టింగ్ చేయడానికి కూడా ఈ ఫీచర్‌ను విరివిగా ఉపయోగించేవారు. 'పోక్' వస్తే వెంటనే 'పోక్ బ్యాక్' చేయడం యూజర్లకు ఒక సరదాగా ఉండేది. అయితే కాలక్రమేణ ఈ ఫీచర్‌పై ఆసక్తి తగ్గిపోవడంతో దాని వాడకం దాదాపుగా ఆగిపోయింది.

ఇప్పుడు ఈ పాత ట్రెండ్‌కు మళ్లీ జీవం పోయాలని ఫేస్‌బుక్ నిర్ణయించింది. ఇందులో భాగంగా, ఇకపై యూజర్లు తమ స్నేహితుల ప్రొఫైల్ పేజీలో 'మెసేజ్' బటన్ పక్కనే 'పోక్' బటన్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అంతేకాకుండా, ఎవరు ఎన్నిసార్లు పోక్ చేశారో లెక్కలు చూసుకోవడానికి, పాత పోకులను గుర్తుచేసుకోవడానికి ఒక ప్రత్యేక పేజీని కూడా అందుబాటులోకి తెచ్చింది.

నిజానికి 'పోక్' ఫీచర్ ఉద్దేశం ఏంటో ఫేస్‌బుక్ ఎప్పుడూ అధికారికంగా వివరించలేదు. "మీరు మీ స్నేహితులను పోక్ చేయవచ్చు. అలా చేసినప్పుడు వారికి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది" అని మాత్రమే దాని సపోర్ట్ పేజీలో పేర్కొంది. అయితే, యూజర్లు మాత్రం దానికో అర్థాన్ని సృష్టించుకుని తమదైన శైలిలో వాడేశారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ మార్పులతో, తెలియని వ్యక్తులను ఇబ్బంది పెట్టకుండా కేవలం స్నేహితులకు మాత్రమే పోక్ చేసేలా పరిమితి విధించారు. ఈ నిర్ణయం పాత యూజర్లలో మళ్లీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.


More Telugu News