నేను అక్కడి వరకు వెళ్లానంటే కారణం నా టీచర్లే: మంత్రి నారా లోకేశ్

  • విజయవాడలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
  • 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
  • ప్రభుత్వ విద్యలో 'ఆంధ్ర మోడల్' తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తామన్న లోకేశ్
తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఓ బ్యాక్ బెంచర్‌నని, అలాంటి తాను ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం వరకు ప్రయాణించగలిగానంటే, దానికి ఏకైక కారణం తన ఉపాధ్యాయులు చూపిన మార్గమేనని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గురువు లేనిదే ఏ మనిషి ఉన్నత స్థానానికి చేరుకోలేడని, తన జీవితంలో తల్లి తర్వాత తాను అత్యంత గౌరవించేది ఉపాధ్యాయులనేనని ఆయన ఉద్ఘాటించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం గురుపూజోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి హాజరైన లోకేశ్, రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులకు పురస్కారాలు అందించి సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, తన పాఠశాల రోజులను గుర్తుచేసుకున్నారు. "మిమ్మల్ని చూశాక నాకు నా స్కూల్ రోజులు గుర్తొచ్చాయి. నేను బాగా అల్లరి చేసేవాడిని, మాది రౌడీ బ్యాచ్. అలాంటి నన్ను మంజులా మేడమ్, ప్రిన్సిపల్ రమాదేవి గారు, ఆ తర్వాత పి. నారాయణ గారు, ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు తీర్చిదిద్దారు. ఈ నలుగురు గురువుల వల్లే నేను ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా మీ ముందు నిలబడగలిగాను" అని భావోద్వేగంగా ప్రసంగించారు.

ప్రభుత్వ విద్య అంటే ఏపీ గురించే మాట్లాడాలి

ప్రభుత్వ విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు. "ప్రభుత్వ విద్య గురించి ఎవరైనా మాట్లాడితే, అది ఆంధ్రప్రదేశ్ గురించే అయి ఉండాలి. ఢిల్లీలో ఏదో మేజిక్ జరుగుతోందని అంటున్నారు. దానికి ఫుల్‌స్టాప్ పెట్టి, అసలైన అద్భుతం ఏపీలో ఉందని చేసి చూపిద్దాం. అందరం కలిసికట్టుగా 'ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్' (లీప్)ను విజయవంతం చేద్దాం" అని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్న తన పిలుపునకు ఉపాధ్యాయులు అద్భుతంగా స్పందించారని, కొందరు స్కూటర్‌కు మైక్ కట్టుకుని మరీ ప్రచారం చేశారని ప్రశంసించారు. ప్రభుత్వ బడుల్లో చేరిస్తే 'జీరో ఇన్వెస్ట్‌మెంట్, హై రిటర్న్స్' వస్తాయని ఓ మహిళా టీచర్ చెప్పిన మాటలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల ముందు 'నో అడ్మిషన్' బోర్డులు పెట్టారంటే, ఆ ఘనత పూర్తిగా ఉపాధ్యాయులదేనని కొనియాడారు.

డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ 

ఉపాధ్యాయ నియామకాల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని లోకేష్ తెలిపారు. "డీఎస్సీ అంటే చంద్రబాబు గారు.. చంద్రబాబు గారంటే డీఎస్సీ. ఆయన హయాంలోనే అత్యధిక నియామకాలు జరిగాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెట్టారు. డీఎస్సీ ప్రక్రియను ఆపాలని దాదాపు 70 కేసులు వేశారు. అయినా, ఎక్కడా ఆగకుండా ఈ సెప్టెంబర్‌లో 16,347 మంది ఉపాధ్యాయులు తరగతి గదుల్లో అడుగుపెట్టబోతున్నారు" అని ప్రకటించారు.

గత ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని, ఉపాధ్యాయులను తీవ్రంగా అవమానించారని లోకేష్ విమర్శించారు. "2019 నుంచి 2024 వరకు ఒక విచిత్రమైన పాలన చూశాం. రోజుకో సంస్కరణ పేరుతో గందరగోళం సృష్టించి, 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరం కావడానికి కారణమయ్యారు. ఉపాధ్యాయులతో వైన్ షాపుల ముందు కాపలా కాయించిన దుస్థితిని చూశాం. జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. అలాంటి కష్టాలన్నింటినీ ఎదుర్కొని నిలబడిన మీ అందరికీ నా ధన్యవాదాలు" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


More Telugu News