నాకు స్వార్థం ఉంది.. నేను రెండోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా!: రేవంత్ రెడ్డి

  • గురుపూజోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని విమర్శ
  • విద్యాశాఖలో సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
"నాకు స్వార్థం ఉంది. ఉపాధ్యాయులు బాగా పనిచేస్తే నేను కూడా రెండోసారి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాను. అలాగని 'నేను ఫామ్ హౌస్‌లో పడుకుంటాను... మళ్లీ ముఖ్యమంత్రిగా చేయండి' అని నేను అడగడం లేదు. మీతో పాటే నేను కూడా కష్టపడతాను" అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నూతన నియామకాలు లేవని ఆరోపించారు. గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మూతపడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. గురుపూజోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని, విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నామని అన్నారు.

విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు బోధిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల కంటే నాణ్యమైన విద్యను అందిస్తామని అందరం ప్రతిజ్ఞ చేద్దామని అన్నారు. ప్రతి సంవత్సరం 200 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసేలా ప్రోత్సహిద్దామని ఆయన అన్నారు.

ఢిల్లీలో కేజ్రీవాల్ రెండోసారి అధికారంలోకి రావడానికి ఆయన చేసిన విద్యాభివృద్ధే కారణమని వ్యాఖ్యానించారు. నేను కూడా విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని హామీ ఇచ్చారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని ముఖ్యమంత్రి అన్నారు. చాలాచోట్ల కేజీ టు పీజీ ఉచిత విద్య అందడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు.

ప్రతి గ్రామానికి జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఉపాధ్యాయులే అన్నారు. జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించేలా చేశారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని తాను ఈ స్థాయికి వచ్చానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో గురుపూజోత్సవం జరిగిందా? అందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుల సహకారం కావాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. ప్రైవేటు స్కూళ్ల టీచర్ల కంటే ప్రభుత్వ టీచర్లకు నైపుణ్యం ఎక్కువ అని వ్యాఖ్యానించారు. విద్యాశాఖను తీసుకోవద్దని, ఆ శాఖ వివాదాస్పదం అని తనకు సూచించినా, తానే స్వయంగా ఆ శాఖను తన వద్ద ఉంచుకున్నట్లు చెప్పారు.


More Telugu News