Donald Trump: మౌంట్‌ రష్మోర్‌ పై తన ముఖం ఉండాలని ట్రంప్ ఉబలాటం... అయ్యేపని కాదంటున్న అధికారులు

Donald Trump Wants Face on Mount Rushmore Officials Say No
  • అమెరికాలో మౌంట్ రష్మోర్ ఒక జాతీయ స్మారక చిహ్నం 
  • జార్జ్ వాషింగ్టన్‌, థామస్ జెఫర్సన్‌, థియోడర్ రూజ్‌వెల్ట్‌, అబ్రహం లింకన్‌ల ముఖ శిల్పాలు
  • తన ముఖం ఉన్న ఏఐ వీడియో షేర్ చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చిరకాల కోరికను మరోసారి బలంగా బయటపెట్టారు. అమెరికా చరిత్రలో నిలిచిపోయిన నలుగురు గొప్ప అధ్యక్షుల ముఖచిత్రాలతో ఉన్న మౌంట్ రష్మోర్‌పై తన ముఖాన్ని కూడా చూడాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు, ఆ అధ్యక్షుల ముఖాల పక్కనే తన ముఖం ఉన్నట్లుగా రూపొందించిన ఒక ఏఐ వీడియోను ఆయన తాజాగా 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు. ఇది ప్రస్తుతం అమెరికాలో కొత్త చర్చకు దారితీసింది.

దక్షిణ డకోటాలోని బ్లాక్ హిల్స్‌లో ఉన్న మౌంట్ రష్మోర్ ఒక జాతీయ స్మారక చిహ్నం. ఇక్కడి భారీ గ్రానైట్ పర్వతంపై అమెరికా జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మాజీ అధ్యక్షులు జార్జ్ వాషింగ్టన్‌, థామస్ జెఫర్సన్‌, థియోడర్ రూజ్‌వెల్ట్‌, అబ్రహం లింకన్‌ల 60 అడుగుల ముఖ శిల్పాలు చెక్కారు. ఏటా లక్షలాది మంది పర్యాటకులు దీనిని సందర్శిస్తుంటారు. ఈ దిగ్గజాల సరసన తన శిల్పం కూడా ఉండాలనేది ట్రంప్ కోరిక. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ సభ్యురాలు అన్నా పౌలినా లూనా... ట్రంప్ ముఖాన్ని అక్కడ చేర్చాలంటూ ప్రతిపాదన కూడా తీసుకువచ్చారు.

అయితే, ట్రంప్ ఆశలకు అధికారులు, నిపుణులు బ్రేకులు వేస్తున్నారు. ఆ పర్వతంపై ఐదో ముఖాన్ని చెక్కడం ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. మౌంట్ రష్మోర్ నిర్వహణ చూసే నేషనల్ పార్క్ సర్వీస్ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఆ పర్వతంపై కొత్తగా శిల్పాన్ని చెక్కేందుకు సురక్షితమైన, స్థిరమైన ప్రదేశం లేదని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న శిల్పాల కారణంగా పర్వతంపై మరిన్ని చెక్కడాలు ప్రమాదకరమని వారు విశ్లేషిస్తున్నారు.

గతంలో జాన్ ఎఫ్. కెన్నడీ, రోనాల్డ్ రీగన్, బరాక్ ఒబామా వంటి అధ్యక్షుల ముఖాలు కూడా మౌంట్ రష్మోర్‌పై చేర్చేందుకు ప్రస్తావనకు వచ్చినా, అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ట్రంప్ విషయంలో కూడా సాంకేతిక కారణాల వల్ల ఆయన కోరిక నెరవేరడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Donald Trump
Mount Rushmore
US Presidents
National Park Service
George Washington
Thomas Jefferson
Theodore Roosevelt
Abraham Lincoln
Anna Paulina Luna

More Telugu News