జడ్జి చాంబర్‌లోకి పిటిషనర్.. తనకు అనుకూలంగా తీర్పు రాయాలంటూ ఒత్తిడి!

  • అనుమతి లేకుండా హైకోర్టు జడ్జి చాంబర్‌లోకి వెళ్లిన కక్షిదారు
  • తన టార్చర్‌తోనే ప్రత్యర్థి లాయర్ చనిపోయారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
  • పిటిషనర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి
  • కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన జస్టిస్ నగేశ్ భీమపాక
  • సీనియర్ సిటిజన్ కావడంతో కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టలేదని వెల్లడి
తెలంగాణ హైకోర్టులో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కేసులో పిటిషనర్‌గా ఉన్న వ్యక్తి ఏకంగా న్యాయమూర్తి చాంబర్‌లోకి వెళ్లి తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో సదరు న్యాయమూర్తి ఆ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసును వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

అంబర్‌పేటకు చెందిన బి. చెన్నకృష్ణారెడ్డి 2008లో ఓ సివిల్ వివాదంపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. న్యాయవాది అవసరం లేకుండా ఆయనే స్వయంగా వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసును విచారించిన జస్టిస్ నగేశ్ భీమపాక గతంలో పిటిషన్‌ను కొట్టివేశారు. దీనిపై చెన్నకృష్ణారెడ్డి రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా అది తిరిగి జస్టిస్ నగేశ్ భీమపాక బెంచ్ వద్దకే విచారణకు వచ్చింది.

ఈ క్రమంలో ఇటీవల చెన్నకృష్ణారెడ్డి అనుమతి లేకుండా నేరుగా జస్టిస్ నగేశ్ భీమపాక చాంబర్‌లోకి వెళ్లారు. తనకు అనుకూలంగా తీర్పు రాయాలని, "మీరు ఎవరు చెబితే వింటారు? ఎవరితో చెప్పించమంటారు?" అని ప్రశ్నించారు. అంతేకాకుండా, "నేను కేసును కొనసాగిస్తూ టార్చర్ పెట్టడం వల్లే నా ప్రత్యర్థి న్యాయవాది గుండెపోటుతో చనిపోయాడు" అని భయపెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన న్యాయమూర్తి, ఇలా చాంబర్‌కు రావడం సరికాదని, వాదనలుంటే ఓపెన్ కోర్టులోనే వింటానని చెప్పి అతడిని బయటకు పంపించారు.

ఈ రివ్యూ పిటిషన్‌పై విచారణ సందర్భంగా నిన్న చెన్నకృష్ణారెడ్డి మరోసారి కోర్టులో దురుసుగా ప్రవర్తించారు. తీర్పు ఎందుకు ఇవ్వరంటూ న్యాయమూర్తిని నిలదీశారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "మీరు నా చాంబర్‌కు వచ్చి అనుకూలంగా తీర్పు రాయాలని అడిగారు. కాబట్టి నేను ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నాను. మీ వాదనలను వేరే జడ్జి ముందు వినిపించండి" అని స్పష్టం చేశారు. పిటిషనర్ సీనియర్ సిటిజన్ అయినందున కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ, కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.


More Telugu News