Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితకు పద్మా దేవేందర్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

Padma Devender Reddy Warns Kalvakuntla Kavitha
  • కవిత సస్పెన్షన్‌ను స్వాగతించిన పద్మా దేవేందర్‌రెడ్డి
  • హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదని హెచ్చరిక
  • రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో కవిత నడుస్తున్నారని ఆరోపణ
  • తన గొయ్యి తానే తవ్వుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • కేసీఆర్ కుమార్తెగా గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారన్న పద్మ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే కవిత నడుస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి హరీశ్‌రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనాన్ని హరీశ్‌రావు ఎండగడుతుంటే... ఆయన సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కారంటూ కవిత ఆరోపించడం దారుణమని ఆమె పేర్కొన్నారు. హరీశ్‌రావుపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.

గతంలో కవిత నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా పార్టీలోని ముఖ్య నేతలకు సమాచారం ఇవ్వలేదని పద్మా దేవేందర్‌రెడ్డి గుర్తుచేశారు. ఆమె ప్రవర్తన మొదటి నుంచి పార్టీకి నష్టం కలిగించేలా ఉందని విమర్శించారు. కేసీఆర్ కుమార్తెగా పార్టీలో లభించిన గౌరవాన్ని కవిత నిలుపుకోలేకపోయారని అన్నారు. కవిత తన గొయ్యి తానే తవ్వుకున్నారని ఎద్దేవా చేశారు. ఆమె చర్యలు స్వయంకృతాపరాధమేనని పేర్కొన్నారు. 
Kalvakuntla Kavitha
Padma Devender Reddy
KCR
Harish Rao
Telangana Politics
BRS Party
Revanth Reddy
Kaleshwaram Project
Telangana Assembly

More Telugu News