నేను అలా అనలేదు: జాన్వీ కపూర్‌పై వ్యాఖ్యల గురించి సింగర్ పవిత్ర వివరణ

  • 'పరమ్ సుందరి'లో జాన్వీ పాత్రపై చెలరేగిన వివాదం
  • తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చిన గాయని పవిత్రా మేనన్
  • తాను జాన్వీని విమర్శించలేదన్న పవిత్ర
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'పరమ్ సుందరి' చుట్టూ అలముకున్న వివాదంపై మలయాళ గాయని పవిత్రా మేనన్ స్పష్టతనిచ్చారు. సినిమాలో కేరళ యువతి పాత్రలో ఉత్తరాదికి చెందిన జాన్వీని ఎంపిక చేయడంపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె తెలిపారు. తాను జాన్వీ నటనను విమర్శించలేదని, కేవలం భాష గురించే ప్రస్తావించానని వివరించారు.

ఈ విషయంపై పవిత్రా మేనన్ మాట్లాడుతూ... "ముందుగా నేను నటిని కాదు, గాయనిని. జాన్వీకి వ్యతిరేకంగా ఒక మలయాళ నటి విమర్శలు చేసిందనే వార్తల్లో వాస్తవం లేదు. నా వ్యాఖ్యల వెనుక వృత్తిపరమైన అసూయ లేదు. నేను మరొకరి అవకాశాలను లాక్కోవాలని చూడలేదు. నా ఉద్దేశం పూర్తిగా భిన్నమైనది" అని అన్నారు.

"నేను భాష గురించి మాత్రమే మాట్లాడాను. వేరే ప్రాంతానికి చెందిన నటీనటులు మన భాషను సరిగ్గా పలకలేరని చెప్పాను. అంతేగానీ, జాన్వీ ఆ పాత్రకు న్యాయం చేయలేదని నేను అనలేదు. నిజానికి ఆమె ఆ పాత్రను అద్భుతంగా చేసింది. నాకు ఆమె వ్యక్తిగతంగా కూడా తెలుసు, రెండుసార్లు కలిశాను" అని పవిత్ర వివరించారు. ఇతర ప్రాంతాల నటులను తీసుకున్నప్పుడు, వారికి భాష నేర్పించడానికి ఒక కోచ్‌ను నియమిస్తే బాగుంటుందన్నదే తన అభిప్రాయమని ఆమె స్పష్టం చేశారు.

గతంలో ఈ వివాదంపై జాన్వీ కపూర్ కూడా స్పందించారు. "నేను మలయాళీని కాదు, మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు. కానీ నాకు కేరళ సంస్కృతి అన్నా, మలయాళ చిత్రాలన్నా ఎంతో ఇష్టం, అభిమానం. ఈ సినిమాలో నేను కేవలం మలయాళ అమ్మాయిగానే కాకుండా, తమిళ యువతిగా కూడా కనిపిస్తాను" అని ఆమె తెలిపారు.

సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన 'పరమ్ సుందరి' చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. కేరళకు చెందిన సుందరి దామోదరం పిళ్లై (జాన్వీ), ఢిల్లీకి చెందిన పరమ్ సచ్‌దేవ్‌ (సిద్ధార్థ్) మధ్య నడిచే ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


More Telugu News