ఐపీఎల్ తొలి మ్యాచ్‌కే రూల్స్ బ్రేక్ చేశా.. షాకింగ్‌ నిజం చెప్పిన లలిత్ మోదీ

  • ఐపీఎల్ తొలి మ్యాచ్‌కే ప్రసార నిబంధనలు ఉల్లంఘించానన్న లలిత్ మోదీ
  • సోనీకి రీచ్ తక్కువని, అన్ని ఛానళ్లకు సిగ్నల్ ఇచ్చేశానని వెల్లడి
  • తర్వాత కేసు వేసుకోమని సోనీకి చెప్పినట్లు స్పష్టీక‌ర‌ణ‌
  • తొలి మ్యాచ్ ఫ్లాప్ అయితే తన పని అయిపోయేదని వ్యాఖ్య 
  • మోదీ వ్యాఖ్యలతో మరోసారి ఐపీఎల్ తొలినాళ్లపై చర్చ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2008లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ విజయవంతం కావడం కోసం తాను ఉద్దేశపూర్వకంగానే ప్రసార నిబంధనలను ఉల్లంఘించానని ఆయన అంగీకరించారు. ఆ ఒక్క మ్యాచ్ ఫలితంపైనే టోర్నమెంట్ భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో తాను ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధపడ్డానని తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.

మైఖేల్ క్లార్క్‌తో మాట్లాడుతూ లలిత్ మోదీ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో ఐపీఎల్ ప్రసార హక్కులు సోనీ నెట్‌వర్క్ వద్ద ఉన్నాయని, అయితే వారి ప్రసార సామర్థ్యం (రీచ్) తక్కువగా ఉందని తాను ఆందోళన చెందానని మోదీ తెలిపారు.

 "టోర్నమెంట్ భవిష్యత్తు మొత్తం ఆ ఒక్క గేమ్ మీదే ఆధారపడి ఉంది. అందుకే ఆ రోజు నేను అన్ని నిబంధనలను బ్రేక్ చేశాను. సోనీతో ప్రత్యేక ఒప్పందం ఉన్నప్పటికీ, వారికి రీచ్ లేకపోవడంతో సిగ్నల్‌ను అందరికీ ఓపెన్ చేయమని చెప్పాను. ప్రసార హక్కులు దక్కని ఇతర బ్రాడ్‌కాస్టర్లు, న్యూస్ ఛానళ్లను కూడా లైవ్ ఇవ్వమని ఆదేశించాను" అని మోదీ వివరించారు.

సోనీ నెట్‌వర్క్ తనపై కేసు వేస్తామని హెచ్చరించినా తాను వెనక్కి తగ్గలేదని మోదీ గుర్తుచేసుకున్నారు. "నాపై కేసు వేస్తామని సోనీ చెప్పింది. 'తర్వాత కేసు వేసుకోండి, దాని సంగతి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మేం లైవ్‌కి వెళ్తున్నాం' అని వారికి స్పష్టం చేశాను. ఎందుకంటే ఆ మొదటి మ్యాచ్‌ను దేశంలోని ప్రతి ఒక్కరూ చూడాలని నేను కోరుకున్నాను. ఒకవేళ ఆ మ్యాచ్ ఫ్లాప్ అయి ఉంటే, నా పని అక్కడితో అయిపోయేది" అని అన్నారు.

వివాదాలకు లలిత్ మోదీ కొత్తేమీ కాదు. కొద్దికాలం క్రితం, 2008 ఐపీఎల్‌లోనే జరిగిన 'స్లాప్‌గేట్' వీడియోను ఆయన బయటపెట్టి కలకలం సృష్టించారు. హర్భజన్ సింగ్, శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియోను ఇన్నేళ్ల తర్వాత లీక్ చేయడంపై హర్భజన్ తీవ్రంగా స్పందించారు. "18 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు ఆ వీడియోను లీక్ చేయడం వెనుక ఏదో స్వార్థపూరిత ఉద్దేశం ఉండి ఉంటుంది. ఇది చాలా తప్పు" అని హర్భజన్ విమర్శించారు. తాజాగా మోదీ చేసిన వ్యాఖ్యలతో ఐపీఎల్ తొలినాళ్ల నాటి వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.


More Telugu News