మిథున్ రెడ్డి దోషి అని మీరెలా చెబుతారు?: ధర్మాన ప్రసాదరావు

  • రాజమండ్రి జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన ధర్మాన, విరుపాక్షి
  • రిమాండ్‌లో ఉన్న వ్యక్తిని దోషిగా చూడటం సరికాదన్న ధర్మాన
  • ప్రతిపక్ష నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపణ
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆలూరు ఎమ్మెల్యే బి. విరుపాక్షి పరామర్శించారు. ములాఖత్ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, మిథున్ రెడ్డి అరెస్టు వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందని, కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేసే ప్రయత్నం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, కేవలం రిమాండ్‌లో ఉన్నంత మాత్రాన ఏ వ్యక్తినీ దోషిగా నిర్ధారించి ప్రచారం చేయడం సరికాదని అన్నారు. పోలీసులు గానీ, రాజకీయ నాయకులు గానీ ఈ విధంగా వ్యవహరించకూడదని సూచించారు. కూటమి ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులందరినీ దోషులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. "రాజకీయాల్లో అరెస్టులు సహజం. మిథున్ రెడ్డికి త్వరలోనే బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం. ఆయనకు ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉంది" అని ధీమా వ్యక్తం చేశారు. మిథున్ రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో ఆలస్యం చేస్తున్నారని ధర్మాన విమర్శించారు.

అనంతరం ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ, గతంలో చంద్రబాబును జైలుకు పంపారన్న కక్షతోనే ఇప్పుడు మిథున్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఇది పూర్తిగా కక్షపూరిత చర్యేనని ఆయన మండిపడ్డారు. లిక్కర్ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని మిథున్ రెడ్డి తమతో చెప్పినట్లు విరుపాక్షి వెల్లడించారు. "జనసేన నాయకులు మహిళలపై దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారు, వారే తగిన బుద్ధి చెబుతారు" అని అన్నారు. 


More Telugu News