నాపై కుట్రలు జరుగుతుంటే మీరేం చేశారు: కేటీఆర్ కు కవిత సూటి ప్రశ్న

  • తన తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నానన్న కవిత
  • తనపై కుట్రలు జరుగుతుంటే కేటీఆర్ పట్టించుకోలేదని విమర్శ
  • ప్రజా సమస్యలపై పోరాడటం పార్టీకి వ్యతిరేకమా? అని ప్రశ్న
కేసీఆర్ కూతురుగా పుట్టడం తాను చేసుకున్న సుకృతమని కవిత అన్నారు. తన తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నానని తెలిపారు. కేసీఆర్ నుంచే సామాజిక తెలంగాణ అంటే ఏమిటో నేర్చుకున్నానని చెప్పారు. తన కొడుకు పసివాడుగా ఉన్నప్పుడు హైదరాబాద్ కు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు. జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు తనపై చిలువలు పలువలుగా తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. తనపై కుట్రలు జరుగుతున్నా, తనపై దుష్ప్రచారం జరుగుతున్నా కేటీఆర్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ను తనపై ప్రచారాన్ని ఆపాలని ఒక చెల్లెలుగా కోరినా ఆయన స్పందించలేదని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతున్నా వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా? అని ప్రశ్నించారు. తనను టార్గెట్ చేసి 103 రోజులైనా కేటీఆర్ అడగరా? అని విమర్శించారు. తనపై కుట్రలు జరుగుతుంటే మీరేం చేశారు అన్నా? అని సూటిగా అడుగుతున్నానని చెప్పారు. 

తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న బీఆర్ఎస్ నుంచి ఒక ప్రకటన వచ్చిందని కవిత తెలిపారు. తీహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పార్టీకి సంబంధించిన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నానని చెప్పారు. గులాబీ కండువా కప్పుకుని ప్రజా సమస్యలపై పోరాడటం పార్టీకి వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. వారికి ఉన్నట్టు తనకు పార్టీలో కోవర్టులు ఎవరూ లేరని చెప్పారు.


More Telugu News