ర్యాలీలో బైక్ కోల్పోయిన వ్యక్తికి... కొత్త బైక్ ఇచ్చిన రాహుల్ గాంధీ

  • బీహార్ ర్యాలీలో బైక్ కోల్పోయిన హోటల్ యజమాని
  • స్థానిక కాంగ్రెస్ నేత దృష్టికి తీసుకెళ్లిన బాధితుడు
  • బాధితుడికి కొత్త బైక్ తాళాలు అందించిన రాహుల్ గాంధీ
బీహార్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బైక్ ర్యాలీలో తన బైక్‌ను కోల్పోయిన ఓ సామాన్య హోటల్ యజమానికి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు. బాధితుడికి సరికొత్త బైక్‌ను ఆయన స్వయంగా బహుమతిగా అందించారు. ఊహించని ఈ పరిణామంతో ఆ యజమాని ఆనందం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే, గత నెల 27న బీహార్‌లోని దర్భంగాలో కాంగ్రెస్ పార్టీ 'ఓటర్ అధికార్ యాత్ర' పేరుతో రోడ్‌షో నిర్వహించింది. ఈ కార్యక్రమ భద్రతా ఏర్పాట్లలో భాగంగా, సిబ్బంది స్థానికంగా ఉన్న కొన్ని బైక్‌లను ర్యాలీ కోసం తీసుకున్నారు. వాటిలో శుభమ్ అనే హోటల్ యజమానికి చెందిన పల్సర్ 220 బైక్ కూడా ఉంది. కేవలం 1.5 కిలోమీటర్ల రోడ్‌షో తర్వాత బైక్‌ను తిరిగి ఇచ్చేస్తామని భద్రతా సిబ్బంది తనకు హామీ ఇచ్చారని శుభమ్ తెలిపారు.

మొదట తన బైక్‌పైనే శుభమ్‌ను కూడా ర్యాలీకి తీసుకెళ్లిన సిబ్బంది, కొద్దిసేపటి తర్వాత అతన్ని ఓ ఎస్‌యూవీలోకి మారాల్సిందిగా కోరారు. అయితే, రోడ్‌షో ముగిశాక చూస్తే తన బైక్‌తో పాటు దాన్ని తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది కూడా కనిపించలేదని శుభమ్ వాపోయారు. స్వాధీనం చేసుకున్న మిగతా బైక్‌లు దొరికినా, తన వాహనం మాత్రం కనిపించకపోవడంతో ఆయన ఆందోళనకు గురయ్యారు.

ఈ విషయం కాంగ్రెస్ నాయకుడు దేవేంద్ర యాదవ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. శుభమ్‌ను పాట్నాకు ఆహ్వానించారు. అక్కడ 'ఓటర్ అధికార్ యాత్ర' ముగింపు కార్యక్రమం వేదికపై రాహుల్ గాంధీ చేతుల మీదుగా శుభమ్‌కు కొత్త బైక్ తాళాలను అందజేశారు. తాను కోల్పోయిన పాత బైక్‌ మోడల్ నే తనకు కానుకగా ఇవ్వడంపై శుభమ్ సంతోషం వ్యక్తం చేశారు. 


More Telugu News