బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు వంద కోట్ల జరిమానా
- గోల్డ్ స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్న కన్నడ నటి రన్యారావు
- రూ.102 కోట్లకు పైగా జరిమానా విధిస్తూ డీఆర్ఐ నోటీసులు
- జైల్లోనే నటికి నోటీసులు అందజేసిన అధికారులు
- నలుగురు నిందితులపై మొత్తం రూ.270 కోట్ల పెనాల్టీ
- జరిమానా చెల్లించకపోతే ఆస్తుల జప్తు అని హెచ్చరిక
- సెప్టెంబర్ 11కు కర్ణాటక హైకోర్టులో తదుపరి విచారణ
ఈ కేసులో రన్యారావుతో పాటు మరో ముగ్గురు నిందితులుగా ఉన్నారు. నలుగురిపైనా కలిపి మొత్తం రూ.270 కోట్ల పెనాల్టీ విధించినట్లు అధికారులు తెలిపారు. నిర్దేశిత గడువులోగా జరిమానా చెల్లించని పక్షంలో ఆమె ఆస్తులను జప్తు చేస్తామని కూడా నోటీసులో స్పష్టంగా హెచ్చరించారు. దీంతో ఈ కేసు మరోసారి కన్నడ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 14.3 కిలోల బంగారంతో రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. అప్పుడే ఆమెను అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు. ఈ కేసులో విచారణ అనంతరం నిందితులకు ఏడాది జైలు శిక్ష పడింది.
ఇదిలా ఉండగా, విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.