Little Hearts Movie: యువతరాన్ని ఆకట్టుకునే సినిమా 'లిటిల్ హార్ట్స్': బన్నీవాసు

Little Hearts Movie Release on September 5 Says Bunny Vas
  • ఈ నెల 5న విడుదల కానున్న లిటిల్ హార్ట్స్ సినిమా
  • నవతరం భావోద్వేగాలకు అద్దంపట్టే సినిమా అన్న బన్నీవాసు
  • ప్రతి ఒక్కరిలోనూ చిన్ననాటి జ్ఞాపకాలు రేపే కథ ఇది అన్న వంశీ నందిపాటి
ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, పంపిణీదారుగా పేరు తెచ్చుకున్న వంశీ నందిపాటి కలిసి రూపొందించిన తాజా చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ ఈ నెల 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి ఆదిత్య హాసన్ నిర్మాతగా, సాయి మార్తాండ్ దర్శకుడిగా పనిచేశారు. మౌళి తనూజ్, శివానీ నాగారం జంటగా నటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు సినిమా విశేషాలను పంచుకున్నారు.

"నవతరం భావోద్వేగాలకు అద్దంపట్టే సినిమా" : బన్నీ వాస్

ఇటీవలి కాలంలో యువతరంపై ఆధారపడి వచ్చే హాస్య చిత్రాలు తగ్గిపోతున్నాయని బన్నీ వాసు అన్నారు. ‘లిటిల్ హార్ట్స్’ 16 నుంచి 20 ఏళ్ల వయసున్న యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించామన్నారు. ఇంటర్, ఎంసెట్ పరీక్షల నేపథ్యంలో సాగే ఈ కథలో, కుటుంబం, చదువు, ప్రేమ, ఆకర్షణ వంటి అంశాల్ని హాస్యపూరితంగా చూపించామని పేర్కొన్నారు. నవ్వించడమే తనకు ఇష్టమని, అందుకే 'మిత్రమండలి' వంటి చిత్రాల తర్వాత ఇది చేస్తుంటే సంతోషంగా ఉందన్నారు.

"ప్రతి ఒక్కరిలోనూ చిన్ననాటి జ్ఞాపకాలు రేపే కథ" : వంశీ నందిపాటి

ఈటీవీ విన్ కంటెంట్ ఎల్లప్పుడూ మన మనసులను తాకేలా ఉంటుందని వంశీ నందిపాటి అన్నారు. ‘#90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్, ఏఐఆర్ వంటి వాటిలాగే, ‘లిటిల్ హార్ట్స్’ కూడా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పారు. ఈ సినిమాలో హీరో తన ప్రేమను ఎలా వ్యక్తం చేశాడన్నదే కథా కేంద్రబిందువు అని అన్నారు. యువ కళాకారులంతా ఎంతో ఉత్సాహంగా ఈ సినిమాలో పనిచేశారన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 170కు పైగా థియేటర్లలో దీనిని విడుదల చేస్తున్నామని పేర్కొన్న వంశీ.. సెప్టెంబర్ 3న హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 4న పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నామని తెలిపారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
Little Hearts Movie
Bunny Vas
Vamsi Nandipati
ETV Win
Sai Marthand
Mouli Tanuj
Shivani Nagaram
Telugu Movie Release
Youth Comedy Film

More Telugu News