ఒక రోజు పుట్టపర్తి సత్యసాయి బాబా నన్ను పిలిచారు: సీఎం చంద్రబాబు

  • చంద్రబాబు తొలిసారిగా సీఎం పదవి చేపట్టి 30 ఏళ్లు పూర్తి 
  • చంద్రబాబుకు శుభాకాంక్షల వెల్లువ
  • క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశం
"పుట్టపర్తి, చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది. నేను ప్రాజెక్టులు కట్టిస్తాను, ప్రభుత్వం వాటి నిర్వహణ బాధ్యత చూసుకోవాలి. అవసరమైతే నా ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టి అయినా ఈ పని పూర్తి చేస్తాను," అంటూ ఒకనాడు పుట్టపర్తి సత్యసాయిబాబా చూపిన సంకల్ప బలాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. ఒక గొప్ప ఆశయం కోసం పనిచేయాలనే తపన ఉంటే నిధులు వాటంతట అవే వస్తాయని, అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని చెప్పడానికి సాయిబాబా జీవితమే గొప్ప ఉదాహరణ అని ఆయన అన్నారు. 

తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన సుదీర్ఘ రాజకీయ, పాలనానుభవాలను వారితో పంచుకుంటూ, పుట్టపర్తి సాయిబాబా స్ఫూర్తిదాయక ఘట్టాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

తపన ఉంటే ఏదైనా సాధ్యమే...!

అధికారులు, ప్రజాప్రతినిధులతో తన అనుభవాలను పంచుకున్న చంద్రబాబు, ప్రజాసేవలో అంకితభావం, తపన ఎంత ముఖ్యమో వివరించారు. "ఒకరోజు సత్యసాయిబాబా నన్ను పిలిపించారు. ఆయన అందరినీ 'బంగారూ' అని పిలుస్తారు, నన్నూ అలాగే పిలిచేవారు. పుట్టపర్తి ప్రాంత తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు తన దగ్గర లేకపోయినా, భక్తుల సహకారంతో లేదా ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టయినా పూర్తి చేస్తానని చెప్పినప్పుడు ఆయన సంకల్పానికి నేను ఆశ్చర్యపోయాను. ఆయన పిలుపుతో పెద్దఎత్తున నిధులు సమకూరాయి, ప్రాజెక్టు పూర్తయింది. ఆ తర్వాత మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ ఆయన తాగునీటి పథకాలు చేపట్టారు. గొప్ప సంకల్పంతో పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పడానికి ఇదే నిదర్శనం" అని చంద్రబాబు ఉద్ఘాటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా అదే తపనతో పనిచేయాలని ఆయన సూచించారు.

విమర్శలకు భయపడితే సంస్కరణలు సాధ్యం కావు

గతాన్ని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తుకు ప్రణాళికలు రచించాలని చంద్రబాబు అన్నారు. "విమర్శలు వస్తాయని భయపడితే మనం అక్కడే ఆగిపోతాం. సంస్కరణలకు వెనకడుగు వేయకూడదు. నా రాజకీయ జీవితంలో కొత్తగా ఆలోచించడమే ఒక విధానంగా పెట్టుకున్నాను," అని తెలిపారు. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు అనేక సవాళ్లు ఎదురయ్యాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని దృఢమైన నిర్ణయాలతో ముందుకు సాగామని చెప్పారు. 

ఉమ్మడి రాష్ట్రంలో విద్య, సాగునీటి రంగాలకు పెద్దపీట వేశామని, ఒకప్పుడు కనీసం 10 హైస్కూళ్లు కూడా లేని రంగారెడ్డి జిల్లాలో 240 ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశామని గుర్తు చేసుకున్నారు. నాడు వెనుకబడిన ఆ జిల్లా, నేడు దేశంలోనే అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఒకటిగా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలో భూములు ఇస్తామన్నా కంపెనీలు ముందుకు రాని పరిస్థితి నుంచి, వారిని ఒప్పించి, మౌలిక సదుపాయాలు కల్పించి హైటెక్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను నెలకొల్పామని వివరించారు.

శాంతిభద్రతలే అభివృద్ధికి పునాది

రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అత్యంత కీలకమని చంద్రబాబు స్పష్టం చేశారు. "నాడు రాయలసీమలో ఫ్యాక్షన్ విపరీతంగా ఉండేది. హత్యకు హత్య అనే రీతిలో ఉండేవారు. హైదరాబాద్‌లో నిరంతరం మత ఘర్షణలు జరిగేవి. తెలంగాణ ప్రాంతంలో నక్సలిజం సమస్యతో నాయకులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి. ఈ మూడింటిపై ఉక్కుపాదం మోపాం. సమర్థులైన అధికారులకు పూర్తి అధికారాలు ఇచ్చి సున్నితమైన ప్రాంతాల్లో నియమించాం. స్వయంగా నేను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అధికారుల్లో ధైర్యం నింపాను. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొని అభివృద్ధి సాధ్యమైంది" అని తెలిపారు.

మహిళా సాధికారత నుంచి విపత్తుల నిర్వహణ వరకు

మహిళా శక్తిని సమర్థంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎన్నో విమర్శలు వచ్చాయని, కానీ నేడు వాటి ఫలితాలను దేశమంతా చూస్తోందని అన్నారు. రైతుల కోసం దేశంలోనే తొలిసారిగా 'ఇన్‌పుట్ సబ్సిడీ' విధానాన్ని ప్రవేశపెట్టింది తామేనని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేశానని, ఉత్తరాఖండ్ వరదల సమయంలో ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి బాధితులను సురక్షితంగా ఇళ్లకు చేర్చానని చెప్పారు. "రాజకీయంగా ఓట్లు రావచ్చు, రాకపోవచ్చు. కానీ కష్టాల్లో ఉన్నవారికి సేవ చేశామన్న తృప్తి అన్నింటికన్నా గొప్పది" అని ఆయన అన్నారు. కులవృత్తుల వారికి అండగా నిలిచేందుకు 'ఆదరణ' వంటి పథకాలు తెచ్చామని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయా వర్గాల వారికి చేయూతనివ్వాలని సూచించారు. అధికారులు మూసధోరణిలో కాకుండా సృజనాత్మకంగా ఆలోచించి పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆయన దిశానిర్దేశం చేశారు.


More Telugu News