బీఆర్ఎస్ పార్టీని వదిలినందుకు చాలా బాధగా ఉంది: కాంగ్రెస్‌కు ఇంద్రకరణ్ రెడ్డి షాక్!

  • బీఆర్ఎస్‌ను వీడటంపై మాజీ మంత్రి అల్లోల ఆవేదన
  • గులాబీ పార్టీని వదిలినందుకు బాధగా ఉందన్న ఇంద్రకరణ్ రెడ్డి
  • ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా లేనని వ్యాఖ్య
  • ప్రజలకు కాంగ్రెస్ పనుల గురించి చెప్పలేకపోతున్నానన్న అల్లోల
బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన ఏడాది తర్వాత మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గులాబీ పార్టీని వదిలిపెట్టినందుకు చాలా బాధగా ఉందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేయలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

"బీఆర్ఎస్ పార్టీని వీడినందుకు నాకు బాధగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ నేను క్రియాశీలకంగా లేను. ప్రభుత్వ పనుల గురించి ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను" అని ఆయన వ్యాఖ్యానించారు. కోనేరు కోనప్పను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని వెల్లడించారు.

గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన, 2024 మే నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.


More Telugu News