Chandrababu Naidu: దమ్ముంటే అసెంబ్లీకి రండి... తేల్చుకుందాం: వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్

Chandrababu Challenges YSRCP Come to Assembly
  • రాజంపేట పర్యటనలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ
  • దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్
  • బాబాయ్ హత్య, కోడికత్తి డ్రామాలపై చర్చకు తాను సిద్ధమన్న సీఎం
  • అప్పులతో సంక్షేమం చేస్తే చిప్పే మిగులుతుందని పాత ప్రభుత్వంపై విమర్శ
  • రాయలసీమను రతనాల సీమగా మార్చి చూపిస్తానని హామీ
  • గత సర్కారులో అనర్హులకు పింఛన్లు ఇచ్చారని ఆరోపణ
ఎన్నికల ముందు ‘సిద్ధం సిద్ధం’ అని నినాదాలు చేసిన వారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నాను. దమ్ముంటే అసెంబ్లీకి రండి.. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో తేల్చుకుందాం" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీకి బహిరంగ సవాల్ విసిరారు. రాజంపేట నియోజకవర్గంలోని బోయనపల్లిలో సోమవారం జరిగిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ, గత ఐదేళ్ల పాలనపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, వైసీపీ నేతలు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఈ సవాల్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీకి రండి.. తేల్చుకుందాం
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. "బాబాయ్ హత్యపై చర్చిద్దాం రండి. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. దళిత డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనపై సమాధానం చెప్పాలి. కోడికత్తి డ్రామా, గులక రాయి డ్రామాలపై కూడా చర్చకు నేను సిద్ధం. వైసీపీ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, మరి చర్చించడానికి వైసీపీ సిద్ధమా?" అంటూ చంద్రబాబు తీవ్ర స్వరంతో నిలదీశారు. తనపై క్లైమోర్ మైన్లతో దాడి చేసినా చలించలేదని, తాను డ్రామాలు ఆడే వ్యక్తిని కాదని ఆయన అన్నారు.

పెన్షన్ల పంపిణీలో అక్రమాలపై విమర్శలు
అంతకుముందు, ముఖ్యమంత్రి నేరుగా బోయనపల్లి గ్రామంలోని యడవల్లి సుమిత్రమ్మ ఇంటికి వెళ్లి ఆమెకు పెన్షన్ అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెన్షన్ అనేది పేదలకు ఇచ్చే దానం కాదని, అది ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. "తెలుగు వారికి పెన్షన్లను పరిచయం చేసింది ఎన్టీఆర్. ఆయన రూ. 30తో ప్రారంభిస్తే, మేం ఇప్పుడు రూ. 4000 ఇస్తున్నాం. దివ్యాంగులకు 12 రెట్లు పెంచింది టీడీపీ ప్రభుత్వమే" అని గుర్తుచేశారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం అవయవాలన్నీ సక్రమంగా ఉన్న తమ పార్టీ కార్యకర్తలకు కూడా దివ్యాంగుల పెన్షన్ ఇచ్చిందని, ఇలాంటి అనర్హులను ప్రజలే నిలదీయాలని పిలుపునిచ్చారు. అర్హులైన పేదలకే ప్రభుత్వ సంపద అందాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సంపద సృష్టితోనే సంక్షేమం
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మాట్లాడుతూ, "అప్పు చేసి పప్పు కూడు తింటే చివరికి చిప్పే మిగులుతుంది. అప్పులు చేసి బాగుపడ్డ వారు ఎవరూ లేరు" అంటూ గత ప్రభుత్వ ఆర్థిక విధానాలను చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఆదాయాన్ని పెంచి, ఆ సంపదను పేదలకు సంక్షేమం రూపంలో అందించడమే తన విధానమని పునరుద్ఘాటించారు. "నేను ఐటీ, హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేశారు. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉన్నతస్థాయిలో ఉన్నారంటే అందుకు ఐటీనే కారణం. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలను ఆర్థికంగా నిలబెట్టాం. మేం చేసిన మంచిని ప్రజలు గుర్తుంచుకోవాలి" అని ఆయన కోరారు.

రాయలసీమకు రత్నాల హారం
రాయలసీమ అభివృద్ధికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు హామీ ఇచ్చారు. "రాయలసీమను రతనాల సీమగా మార్చడమే నా లక్ష్యం. సీమకు నీళ్లిచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది. ఆయన స్ఫూర్తితో రాయలసీమలో కరవును శాశ్వతంగా దూరం చేస్తాం. నిన్ననే కుప్పానికి నీళ్లు తీసుకెళ్లాను, భవిష్యత్తులో రాజంపేట, కోడూరుకు కూడా సాగునీరు అందిస్తాం" అని భరోసా ఇచ్చారు. కరవు జిల్లా అయిన అనంతపురానికి కియా పరిశ్రమను తీసుకొచ్చి ఆ ప్రాంత రూపురేఖలు మార్చామని, అదే తరహాలో రాయలసీమకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తామని తెలిపారు. ఆడబిడ్డల జోలికి వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తన బలం, బలగం ప్రజలేనని, వారి సహకారంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh Assembly
YSRCP Challenge
Pensions Distribution
Rayalaseema Development
AP Politics
TDP Government
Political Challenge
Andhra Pradesh News
AP Assembly Sessions

More Telugu News