Sudarshan Reddy: చంద్రబాబు, పవన్, కేసీఆర్, జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నా... తెలుగువాడికి అవకాశం వచ్చింది: రేవంత్ రెడ్డి

Revanth Reddy Appeals to Chandrababu Pawan KCR Jagan to Support Sudarshan Reddy
  • ఉప రాష్ట్రపతి బరిలో నిలిచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
  • రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలు పక్కన పెట్టాలన్న రేవంత్ రెడ్డి
  • ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతివ్వాలన్న ముఖ్యమంత్రి
ఉపరాష్ట్రపతిగా తెలుగు వ్యక్తిని గెలిపించుకునే అవకాశం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు ఆయన విజ్ఞప్తి చేశారు. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి" అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రకటించామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా కూటమి ఆలోచనను ఆయన గౌరవించారని తెలిపారు. హైదరాబాద్‌లో జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికకు అత్యంత ప్రాధాన్యం ఉందని అన్నారు.

రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే అజెండాతో ఎన్డీయే అభ్యర్థిని నిలబెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపిందని చెప్పారు. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలపై ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని, కానీ తెలుగు వ్యక్తికి అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు.
Sudarshan Reddy
Vice President Election
Revanth Reddy
Chandrababu Naidu
Pawan Kalyan
KCR

More Telugu News