సీఎంగా 30 ఏళ్లు.. చంద్రబాబుపై తనయుడు లోకేశ్ ప్రశంసల వర్షం

  • ముఖ్యమంత్రిగా చంద్రబాబు 30 ఏళ్ల ప్రస్థానంపై తనయుడు లోకేశ్ పోస్ట్
  • ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు నాన్న కొత్త రూపం ఇచ్చారని ప్రశంస
  • టెక్నాలజీ, సంక్షేమాన్ని జోడించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కొనియాడిన లోకేశ్ 
  • హంద్రీనీవాతో రాయలసీమ రూపురేఖలు మార్చారని కితాబు
  • ఇంట్లో నాన్నగా, ఆఫీసులో బాస్‌గా ఆయన్ని పిలవడం నా అదృష్టమని వ్యాఖ్య
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తన తండ్రిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టిన ఆయన, చంద్రబాబు నాయకత్వ పటిమను, దార్శనికతను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు కొత్త రూపాన్నిచ్చి, వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావడమే కాకుండా, పటిష్ఠమైన వ్యవస్థలను నిర్మించిన శకం ఇదని లోకేశ్ అభివర్ణించారు.

పరిపాలనలో టెక్నాలజీని జోడించడం, పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాలు కల్పించడం ద్వారా చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేశారని లోకేశ్ పేర్కొన్నారు. హైటెక్ సిటీ, జినోమ్ వ్యాలీ వంటి వాటితో రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలబెట్టారని, భవిష్యత్ నగరాలకు ప్రతీకగా అమరావతిని నిర్మించాలనే సంకల్పాన్ని చాటారని గుర్తుచేశారు. జవాబుదారీతనంతో కూడిన వేగవంతమైన పాలన అందిస్తూ, పౌరులకు, సంస్థలకు సాధికారత కల్పించే వేదికలను నిర్మించారని వివరించారు. పేదరిక నిర్మూలన పథకాలు, రిజర్వేషన్ల అమలుతో సామాజిక న్యాయం అందించడంలో చంద్రబాబు ఎంతో కృషి చేశారని లోకేశ్ ప్రశంసించారు.

రాయలసీమ సాగునీటి సమస్యపై చంద్రబాబు చూపిన చొరవను లోకేశ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తరలించి కరవుపీడిత రాయలసీమను సస్యశ్యామలం చేశారని అన్నారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి, గ్రామాల్లో చెరువులను నింపి రైతుల ఆదాయాన్ని స్థిరపరిచారని తెలిపారు. పోలవరం, బనకచర్ల వంటి ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

"ఇంట్లో ‘నాన్న’ అని, ఆఫీసులో ‘బాస్’ అని పిలవడం నా అదృష్టం. ఆయన అనుభవం కలిగిన యువకుడు. స్పష్టత, ధైర్యం, నమ్మకంతో కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు" అని లోకేశ్ తన పోస్టులో ఉద్వేగంగా పేర్కొన్నారు.


More Telugu News