Revanth Reddy: ఎమ్మెల్యేగా పోటీకి 21 ఏళ్లు చాలు.. రాజ్యాంగం సవరించాలి: రేవంత్ రెడ్డి

Revanth Reddy Calls for Lowering MLA Candidacy Age to 21
  • కేరళలో ఎంపీ మెరిట్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
  • 2029లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని యువతకు పిలుపు
  • బీజేపీ యువత హక్కులను కాలరాస్తోందని తీవ్ర విమర్శలు
  • ఎమ్మెల్యేగా పోటీ చేసే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్
  • ఓటు హక్కు, రాజ్యాంగ పరిరక్షణకు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి
  • తెలంగాణలో విద్య, ఆర్థిక రంగాల అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన సీఎం
దేశంలో ప్రతి ఒక్కరి ఓటు హక్కును, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 2029లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు యువత సంకల్పం తీసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం కేరళలోని అలప్పుజలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ నిర్వహించిన ‘ఎంపీ మెరిట్ అవార్డ్స్-2025’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని కీలక డిమాండ్ చేశారు. "21 ఏళ్లకే ఐఏఎస్ అధికారులు జిల్లాలను సమర్థంగా పరిపాలిస్తున్నప్పుడు, అదే వయసున్న యువకులు ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేయకూడదు?" అని ప్రశ్నించారు. దీని కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేశారు.

2026లో జరగబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికలు, 2029లో దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి డబ్బు, అధికారం, మీడియా మద్దతు లేకపోయినా.. ప్రజల మద్దతు పుష్కలంగా ఉందని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తెలంగాణ నుంచి పోటీ చేయమని ఆహ్వానించామని, కానీ వారు కేరళను తమ కర్మభూమిగా ఎంచుకున్నారని చెప్పారు.

బీజేపీ యువత రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని, వారి హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని అన్నారు. "దేశంలో మార్పు తీసుకురాగల శక్తి యువతకు ఉంది. యువతే మా బ్రాండ్ అంబాసిడర్లు. వారి భవిష్యత్తు కోసం వారు చేసే పోరాటం కచ్చితంగా విజయం సాధిస్తుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో పెద్ద ఉద్యమం నడుస్తోందని, అందులో అందరూ చేరాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ అభివృద్ధి నమూనా గురించి మాట్లాడుతూ, ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. రాష్ట్రంలో కేవలం 55 రోజుల్లో 11,055 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, 100 నియోజకవర్గాల్లో రూ. 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Revanth Reddy
Telangana
Kerala
Rahul Gandhi
Congress
Lok Sabha
Election
Constitution
Youth
Politics

More Telugu News