Kavya Mukherjee: పాఠ్యపుస్తకాల్లో ట్రాన్స్‌జెండర్ల అంశాలు... సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థిని

Kavya Mukherjee files PIL in Supreme Court on transgender issues in textbooks
  • పాఠశాల సిలబస్‌లో ట్రాన్స్‌జెండర్ల అంశాలు చేర్చాలని సుప్రీంకోర్టులో పిల్
  • 12వ తరగతి విద్యార్థిని కావ్య ముఖర్జీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం
  • ప్రస్తుత పాఠ్యాంశాలు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పిటిషన్‌లో వాదన
  • ట్రాన్స్‌జెండర్ల అక్షరాస్యత జాతీయ సగటు కన్నా చాలా తక్కువని ప్రస్తావన
  • ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీలకు ఆదేశాలివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి
  • సోమవారం విచారణ చేపట్టనున్న సీజేఐ ధర్మాసనం
దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాల్లో ట్రాన్స్‌జెండర్ల హక్కులు, లింగ గుర్తింపు, లింగ సమానత్వం వంటి అంశాలను చేర్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. 12వ తరగతి చదువుతున్న కావ్య ముఖర్జీ అనే విద్యార్థిని ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడం గమనార్హం.

న్యాయవాది అనిల్ కుమార్ ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం ఎన్‌సీఈఆర్‌టీ, రాష్ట్రాల ఎస్‌సీఈఆర్‌టీలు రూపొందిస్తున్న పాఠ్యపుస్తకాల్లో లింగ గుర్తింపు, లింగ వైవిధ్యం వంటి సున్నితమైన అంశాలపై ఎలాంటి సమాచారం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది 2019 నాటి ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టానికి, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు పూర్తిగా విరుద్ధమని వాదించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల పాఠ్యపుస్తకాలను సమీక్షించామని, కేరళ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ అంశాలను వ్యవస్థాగతంగా విస్మరించారని పిటిషన్‌లో తెలిపారు. ఇలాంటి సిలబస్ కారణంగా విద్యార్థుల్లో ట్రాన్స్‌జెండర్లపై అవగాహన లోపించి, వివక్ష, చిన్నచూపు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19, 21, 21Aలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.

దేశంలో జాతీయ అక్షరాస్యత సగటు 74 శాతంగా ఉంటే, ట్రాన్స్‌జెండర్లలో ఇది కేవలం 57.06 శాతంగానే ఉందని గణాంకాలను ఉటంకించారు. సామాజిక వివక్ష, విధానపరమైన నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలనే అనుసరిస్తున్నందున, ఈ అంశాలను సిలబస్‌లో చేర్చడం ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని వివరించారు.

వయసుకు తగినట్లుగా, శాస్త్రీయబద్ధమైన సమాచారంతో ట్రాన్స్‌జెండర్ల అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చేలా ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీలను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది.
Kavya Mukherjee
Transgender rights
NCERT
School curriculum
Gender equality
Supreme Court
Transgender Persons Act 2019
Gender identity
Education
Social justice

More Telugu News