Nandamuri Balakrishna: మన బాలయ్య గ్రేట్: బండి సంజయ్

Nandamuri Balakrishna is Great Says Bandi Sanjay
  • అర్ధశతాబ్దానికి పైగా హీరోగా కొనసాగిన అరుదైన ఘనత బాలకృష్ణకు దక్కిందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
  • వయస్సు పెరిగినా నటనలో వన్నె తగ్గకుండా అద్భుతంగా కొనసాగుతున్న ఆయన ప్రయాణం నిజంగా “అన్ స్టాపబుల్” అన్న బండి సంజయ్
  • బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మంది ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సేవలు అందిస్తున్నారని వ్యాఖ్య
తెలుగు సినీ పరిశ్రమలో అర్ధ శతాబ్దానికి పైగా హీరోగా కొనసాగిన అరుదైన ఘనత నందమూరి బాలకృష్ణకు దక్కిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వయస్సు పెరుగుతున్నా నటనలో వన్నె తగ్గకుండా అద్భుతంగా కొనసాగుతున్న మన బాలయ్య గొప్పవారని, ఆయన ప్రయాణం నిజంగా "అన్ స్టాపబుల్" అంటూ ప్రశంసించారు.

హైటెక్ సిటీలోని హోటల్ ట్రైడెంట్‌లో నిర్వహించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ – యూకే సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బండి సంజయ్.. బాలయ్య సినీ, రాజకీయ, సామాజిక సేవలను ప్రశంసించారు. 50 ఏళ్ల సినీ జీవితం సందర్భంగా బాలయ్యకు ఈ గౌరవం లభించింది.

"కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, బాలకృష్ణ స్థాపించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మంది ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సేవలు అందిస్తున్నారు. ఇది మరువలేని కృషి" అని ఆయన పేర్కొన్నారు.

సినిమా రంగంలో పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక అంశాలపై ఎన్నో ప్రయోగాలు చేసిన పరిపూర్ణ నటుడుగా బాలయ్య వెలుగొందారని అన్నారు. కథానాయకుడు, మహానాయకుడు వంటి చిత్రాల్లో దాదాపు 60 గెటప్పులతో ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రజలకు చాటిచెప్పిన వారసుడిగా ప్రశంసించారు.

పద్మభూషణ్ వంటి భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఆర్ నేషనల్ అవార్డుతో తెలంగాణ ప్రభుత్వం బాలయ్య సేవలను గుర్తించి సత్కరించడం గర్వకారణమని తెలిపారు. రాజకీయాల్లో ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, ఎమ్మెల్యేగా బాలయ్య చూపుతున్న క్రియాశీలత ఎంతో ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. 
Nandamuri Balakrishna
Bandi Sanjay
Telugu cinema
Basavatarakam Cancer Hospital
World Book of Records
NTR
MLA
Telangana
Pauranika movies
Tollywood

More Telugu News