టీడీపీ నుంచి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.. నాకు ఆత్మీయుడు: రేవంత్ రెడ్డి

  • ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతికి శాసనసభ సంతాపం
  • నివాళులర్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం
  • క్లాస్‌గా కనిపించే మాస్ లీడర్ అంటూ కొనియాడిన సీఎం
దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు తెలంగాణ శాసనసభ నివాళి అర్పించింది. జూబ్లీ‌హిల్స్ శాసనసభ్యుడు గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు గోపీనాథ్ తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాగంటి గోపీనాథ్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. "రాజకీయంగా మా పార్టీలు వేరైనా, గోపీనాథ్ నాకు మంచి మిత్రుడు. ఆయన చూడటానికి చాలా క్లాస్‌గా కనిపించినా, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయనో అసలైన మాస్ లీడర్" అని సీఎం కొనియాడారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ఆయన మరణం కుటుంబానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

గోపీనాథ్ రాజకీయ, సినీ ప్రస్థానాన్ని రేవంత్ రెడ్డి సభకు వివరించారు. విద్యార్థి దశ నుంచే చురుగ్గా ఉన్న ఆయన, 1983లో తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా, హుడా డైరెక్టర్‌గా, జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా పలు పదవులు చేపట్టారని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన మాగంటి, సినీ రంగంలో నిర్మాతగా కూడా రాణించారని పేర్కొన్నారు. ‘పాతబస్తీ’, ‘రవన్న’, ‘భద్రాద్రి రాముడు’, ‘నా స్టైలే వేరు’ వంటి నాలుగు చిత్రాలను ఆయన నిర్మించారని వెల్లడించారు.

మరోవైపు శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


More Telugu News