Shraddha Tiwari: ప్రియుడి కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయి, మరో యువకుడిని పెళ్లాడి తిరిగొచ్చిన యువతి

Indore Woman Shraddha Tiwari Elopes and Marries Stranger
  • ‘జబ్ వీ మెట్’ సినిమా స్టోరీని తలపిస్తున్న ఘటన
  • ఆ సినిమాలోలాగే రత్లామ్ రైల్వే స్టేషన్ లో ఒక్కటైన జంట
  • ఇండోర్ యువతి జీవితంలో సినిమాను మించిన ట్విస్టులు
ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ఓ యువతి ఇంట్లో నుంచి పారిపోయింది.. రైల్వే స్టేషన్ కు చేరుకుని ఎదురుచూస్తున్న యువతికి ప్రియుడు హ్యాండిచ్చాడు. దీంతో దిక్కుతోచక రైలెక్కిన యువతికి మరో యువకుడు పరిచయమయ్యాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువతికి ధైర్యం చెప్పి ఆ ప్రయత్నాన్ని విరమింపజేశాడు. వారం రోజుల తర్వాత ఆ యువకుడిని పెళ్లాడి యువతి తన ఇంటికి తిరిగి వచ్చింది. ఇండోర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన 18 ఏళ్ల క్రితం విడుదలైన  ‘జబ్ వీ మెట్’ సినిమాను తలపిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సినిమాలోలాగే రత్లామ్ రైల్వే స్టేషన్ లోనే ఈ యువతీయువకులు కూడా ఒక్కటవ్వడం గమనార్హం.

ఇండోర్ లోని ఎంఐజీ కాలనీకి చెందిన శ్రద్ధా తివారీ బీబీఏ ఫైనల్ చదువుతోంది. సార్థక్ అనే యువకుడిని ప్రేమించిన శ్రద్ధ.. అతడిని పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో నుంచి పారిపోయింది. రైల్వే స్టేషన్ కు వెళ్లిన శ్రద్ధకు ప్రియుడు సార్థక్ కనిపించలేదు. సార్థక్ కు ఫోన్ చేయగా.. ‘‘నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నేను రావడంలేదు” అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో శ్రద్ధ దిక్కుతోచని పరిస్థితిలో పడింది.

మనస్తాపంతో రైలెక్కి రత్లామ్ స్టేషన్ లో దిగింది. ఆపై ఏం చేయాలో తెలియక స్టేషన్ ఆవరణలో కూర్చుంది. ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న శ్రద్ధను కరణ్ దీప్ గమనించి పలకరించాడు. తను చదివే కాలేజీలోనే ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న కరణ్ దీప్ ను గుర్తుపట్టిన శ్రద్ధ తన పరిస్థితిని చెప్పుకుని బాధపడింది. ఇంటికి తిరిగి వెళ్లాలని కరణ్ దీప్ సూచించగా.. శ్రద్ధ నిరాకరించింది. పెళ్లి చేసుకుంటానని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని, ఇంటికి వెళ్లాల్సి వస్తే పెళ్లి చేసుకునే వెళతానని చెప్పింది.

తనకు చావు తప్ప మరో మార్గంలేదని కన్నీటిపర్యంతమైంది. దీంతో శ్రద్ధ బాధను అర్థం చేసుకున్న కరణ్ దీప్.. తాను పెళ్లి చేసుకుంటానని ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. శ్రద్ధ అంగీకరించడంతో మహేశ్వర్‌-మండలేశ్వర్‌కు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఆపై ఇండోర్ లోని శ్రద్ధ ఇంటికి వెళ్లారు. ప్రియుడు సార్థక్ ను పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో నుంచి పారిపోయిన శ్రద్ధ.. కరణ్ దీప్ ను పెళ్లి చేసుకుని వారం రోజుల తర్వాత అలా ఇంటికి తిరిగొచ్చింది.
Shraddha Tiwari
Indore
Ratlam Railway Station
Jab We Met
love affair
elopement
Karan Deep
marriage
betrayal
love story

More Telugu News